Diamond League Final 2023 Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. తాజాగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ టైటిల్లో తన 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో పాటు కనీసం టైటిల్‌ను కూడా నెగ్గలేకపోయాడు. ఫైనల్లో రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఈ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వాద్లెచ్ ఛాంపియన్‌గా నిలిచాడు(Diamond league final winner).
అమెరికా వేదికగా శనివారం జరిగిన టైటిల్ మ్యాచ్‌లో నీరజ్ జావెలిన్‌ను 83.80 మీటర్లు విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొదటి, నాలుగు ప్రయత్నాల్లో ఫెయిల్ అయిన నీరజ్... తన రెండో ప్రయత్నంలో విసిరిన దూరంతో ఈ స్థానంలో నిలిచాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.
విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకబ్ వాద్లెచ్ తన చివరి ప్రయత్నంలో 84.24 మీటర్ల అత్యుత్తమ త్రోను వేశాడు. దీంతో టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇక ఫిన్లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ 80.90 మీటర్లు విసిరి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నీరజ్ చోప్రా మరోసారి విజేతగా నిలుస్తాడని అందరూ భావించారు. గత ఏడాది జ్యురిచ్‌లో జరిగిన చోప్రా డైమండ్ లీగ్‌లో అతడు టైటిల్ నెగ్గాడు. కానీ ఇప్పుడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు 12 వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇక టైటిల్ నెగ్గిన జాకబ్ వాద్లెచ్కు 30 వేల డాలర్ల నగదు బహుమతి దక్కనుంది.