హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది. ప్రత్యర్థి మెల్లిగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. శారీరకంగా ఓపిక, సామర్థ్యం ఉన్నా.. మానసికంగా ఏమాత్రం కుంగిపోయినా మ్యాచ్‌ను చేజారిపోవడం కొన్నిసార్లు చూస్తుంటాం! ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధిస్తున్నా. ఒకటో, రెండో పాయింట్లు సాధిస్తే గెలిచినట్లే. ఈలోపే ఆలోచనలు హద్దులు దాటుతాయి. గెలుపు సంబరాల ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. ఈలోపు ప్రత్యర్థి పుంజుకుని మ్యాచ్‌ను లాగేసుకోవడం ఇంకొన్ని సార్లు గమనిస్తుంటాం! ఆటపై ఏకాగ్రత లేకపోవడం.. మెదడుపై నియంత్రణ లేకపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలివి. అయితే మన మెదడు మన నియంత్రణలో ఉండటానికి ధ్యానమే అత్యుత్తమ మార్గం అని అంటున్నాడు జాతీయ బ్యాట్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్. ధ్యానం గురించి ఆయన చెప్పిన విశేషాలేంటో తెలుసుకుందాం.
ధ్యానం ఎందుకు?
విశాల దృక్పథంలో చూస్తే ఆడేటప్పుడు వచ్చే ఆలోచనల్లో స్పష్టత ఉండటం మంచిది. మరో కోణంలో ఆలోచనలు లేకపోతే మరీ మంచిది. మ్యాచ్‌లో ఎలా ఆడాలన్న ఆలోచనలు ఉండటం.. రావడం విశాల దృక్పథం. అసలు ఏమాత్రం ఆలోచనలు లేకుండా ఆడటం అత్యుత్తమ మార్గం. దాన్నే క్రీడల్లో 'జోన్' అంటారు. ఆ జోన్‌లోకి వెళ్లడానికి అత్యంత ముఖ్యమైన టెక్నిక్.. ధ్యానం.
క్రీడల్లో ప్రతికూల, అతి సానుకూల ఆలోచనలు రెండూ మంచివి కావు. ఇలాంటి ఆలోచనలు రాకుండా మెదడును కుదురుగా ఉంచేదే ధ్యానం. ఒక పిల్లాడు పదో తరగతి తప్పితే అతడి ఇల్లు, కుటుంబం, బంధువుల వరకే తెలుస్తుంది. ఒక క్రీడాకారుడు ఓడిపోతే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ పరిణామం క్రీడాకారుల్లో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది. వాళ్లు నైరాశ్యంలోకి వెళ్లిపోతారు. ప్రతికూలమైనవే కాదు.. అతి సానుకూల ఆలోచనలు వచ్చినా కష్టమే. మ్యాచ్ ముగియక ముందే చాలామంది భవిష్యత్తులోకి వెళ్లిపోతారు. గెలుపు తర్వాత ఏం చేయాలనే ఊహల్లోకి వెళ్లిపోతారు. ఈలోపు మ్యాచ్‌ను సరిగా ముగించడం మరిచిపోతారు. ఆ క్షణంలో పూర్తి ఏకాగ్రతతో ఉండటం అత్యంత ముఖ్యం. ఇందుకు ధ్యానం దోహద పడుతుంది.
ధ్యాన యంత్రం