భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ... దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నరెజ్లర్లకు దిల్లీ పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. తోపులాటలో అధికారులు తమపై దాడి చేస్తూ.. దూషించారని నిరసన తెలుపుతున్న అథ్లెట్లు ఆరోపించారు. ఈ ఘర్షణలో రెజర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌తో పాటు పలువురికి తలపై గాయాలయ్యాయని తెలిసింది.
ఇలా జరిగింది.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి.. రెజర్ల కోసం మడత మంచాలు తీసుకొచ్చారు. వారికి అవి ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాటిని అనుమతించలేదు. అయినా నిరసన మద్దతుదారులు, సోమనాథ్ అనుచురుల.. ట్రక్కు నుంచి పడకలను బయటకు తీయడానికి ప్రయత్నించారట. ఈ క్రమంలోనే రెజర్లు-సోమనాథ్ అనుచురులకు.. పోలీసులతో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో సోమనాథ్ భారతితో పాటు మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
ఈ గొడవపై తర్వాత రెజ్లర్ భజరంగ్ పునియా స్పందించారు. "మాకు యావత్ దేశం మద్దతు అవసరం. ప్రతి ఒక్కరూ దిల్లీకి రావాలి. పోలీసులు మాపై బలప్రయోగం చేస్తున్నారు. మహిళలను దూషించారు" అని పేర్కొన్నారు. ఇంకా ఈ ఘటనపట్ల మహిళా రెజ్లర్లు కన్నీటిపర్యంతమయ్యారు. దేశానికి పథకాలు అందించిన రెజ్లర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందులో తప్పేముంది.. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు.. సమీపంలోని 4 స్టార్ హోటల్లో భోజనం చేశారు. బజ్‌రంగ్‌తో పాటు సంగీత ఫొగాట్ తదితరులు ఖరీదైన హోటల్లో భోజనం చేసిన ఫొటోస్ సోషల్‌మీడియాలో విస్తృతమయ్యాయి. దీనిపై తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ విమర్శలను బజ్‌రంగ్ పునియా తిప్పి కొట్టారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. "జంతర్ మంతర్ వద్ద అస్సలు ఎవరూ ఉండట్లేదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. మీడియా వాళ్లు కూడా మాతో పాటు ఇక్కడే రాత్రి పూట ఉంటున్నారు. నిరసనకారుల్లో మహిళలు కూడా ఉన్నారు. వారికి కొన్ని పర్సనల్ పనులు, అవసరాలుంటాయి. స్నానాలు చేయాలి, బట్టలు మార్చుకోవాలి. అలాంటివన్నీ రోడ్డు మీద చేయలేం కదా? మేం నిరసన చేస్తున్న ప్లేస్‌లో నీళ్లు కూడా లేవు. అందుకే హోటల్‌కు వెళ్లాం. నిరసన చేస్తున్నామంటే రోడ్డు మీదే స్నానాలు చేయాలని ఉండదు కదా? మేం ఇక్కడ నిద్ర పోవట్లేదని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి. మీడియా వాళ్లు ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నారు." అని బజ్‌రంగ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రెజ్లర్లను కలిసిన పీటీ ఉష.. నిరసనపై నిన్న అలా నేడు ఇలా