తెలంగాణ

telangana

ETV Bharat / sports

"ఒలింపిక్స్​కు గుడ్​బై... కానీ సముద్రాన్ని ఈదేస్తా" - 2020 పారా ఒలింపిక్స్

భారత ప్రముఖ​ క్రీడాకారిణి, పారా అథ్లెట్​ దీపా మాలిక్​ 2020 పారా ఒలింపిక్స్​లో పాల్గొనట్లేదు. వెన్నెముక గాయం కారణంగా మెగా ఈవెంట్​ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. 2016 పారా క్రీడల్లో భారత్​కు పతకం తెచ్చిన మొదటి క్రీడాకారిణి దీపా కావడం విశేషం.

"ఒలింపిక్స్​​ వదిలినా సముద్రాన్ని ఈదేస్తాను"

By

Published : Jul 16, 2019, 5:55 PM IST

బ్రెజిల్​ వేదికగా జరిగిన 2016 పారా ఒలింపిక్స్​లో భారత జెండాను రెపరెపలాడించిన క్రీడాకారిణి దీపా మాలిక్. షాట్​పుట్​ విభాగంలో పోటీలో పాల్గొని వెండి పతకంతో సత్తా చాటింది. ​భారత్​కు పతకం తెచ్చిన మొదటి మహిళగా ఘనత సాధించింది.

​2016 ఒలింపిక్స్​లో దీపా మాలిక్​

టోక్యోలో ఆగస్ట్​ 25 నుంచి ప్రారంభం కాబోతున్న పారా ఒలింపిక్స్​-2020 నుంచి షాట్​పుట్, జావలిన్​ త్రో క్రీడల్లో ఆమె విభాగాన్ని తొలగించారు. ఫలితంగా డిస్కస్​ త్రో మాత్రమే దీపా మాలిక్​కు మిగిలింది. కానీ గాయం కారణంగా అందులోనూ పోటీ చేయలేకపోతున్నట్లు పేర్కొంది​. ముంబయిలో భారత మాజీ స్పిన్నర్​ నీలేశ్​ కులకర్ణి ఆధ్వర్యంలో ఉన్న అంతర్జాతీయ క్రీడా నిర్వాహక సంస్థ స్నాతకోత్సవ వేడుకకు హాజరై ఈ షాకింగ్​ విషయాలు వెల్లడించింది.

" 2020 పారా ఒలింపిక్స్​ సహా ఏ టోర్నీలోనూ, ప్రపంచ ఛాంపియన్​షిప్​లు, ఈవెంట్లలోనూ పాల్గొనట్లేదు. నాకు ప్రావీణ్యం ఉన్న షాట్​పుట్​, జావలిన్​ త్రో 53 కేజీల క్యాటగిరీ విభాగాన్ని రానున్న ఒలింపిక్స్​లో తొలగించారు. నా చేతుల్లో ఉన్నది ఒక్క డిస్కస్​ త్రో మాత్రమే. కానీ వెన్నెముక గాయం కారణంగా ఈ ఆటలోనూ పాల్గొనలేకపోతున్నా".
-- దీపా మాలిక్​, పారా అథ్లెట్​

సముద్రాన్ని ఓ పట్టుపడతా..

2018లో జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో డిస్కస్​ త్రో విభాగం నుంచి పోటీ చేసి కాంస్య పతకం గెలిచిందీ 48 ఏళ్ల దీపామాలిక్. అయితే వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్​లో పోటీ చేయట్లేదు కాబట్టి ఫిట్​నెస్​, శిక్షణపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు స్విమ్మింగ్​లో సాధన చేయనున్నట్లు తెలిపింది. జాతీయ స్థాయిలో స్విమ్మర్​గా రాణించేందుకు బాగా కష్టపడతానని చెప్పుకొచ్చింది.

"ఈ ఏడాది సముద్రంలో స్విమ్మింగ్​ చేసి నేను అనుకున్న మైలురాయి చేరుకోవాలనుకుంటున్నాను. ఇది పోటీ రూపంలో కాకపోయినా నా జీవితంలో గొప్ప లక్ష్య సాధన కోసం చేస్తున్నా" అని దీపా వివరించింది.

'స్విమ్మింగ్​లో సత్తా చాటుతా'

ఇదే కార్యక్రమంలో పారా అథ్లెట్లకు ప్రభుత్వం తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరింది. కార్పొరేట్​ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్​) కార్యక్రమంలో భాగంగా పారా స్పోర్ట్స్​ను ప్రైవేటు సంస్థలు దత్తత తీసుకోవాలని అభిప్రాయపడింది. పారా క్రీడాకారులకు సహాయం చేసేందుకు కోచ్​లు, సర్వోపకారులను నియమించాలని ప్రభుత్వానికి విన్నవించింది.

పతకాల రాణి

ఆమె ఓ స్ఫూర్తి...

దీపా మాలిక్​... వీల్​చైర్​లోనే కూర్చునే ఈమె భారతదేశం గర్వించదగ్గ పారా అథ్లెట్లలో ఒకరు. స్విమ్మింగ్​, జావలిన్​ త్రో, షాట్​పుట్​, క్రికెట్​, డిస్కస్​ త్రో వంటి పలు రంగాల్లో ప్రావీణ్యం ఆమె సొంతం. వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో 54, అంతర్జాతీయ వేదికలపై 13 బంగారు పతకాలు సాధించింది. నాలుగుసార్లు లిమ్కా బుక్​ రికార్డుల్లో పేరు లిఖించుకొంది. అందుకే ఈ క్రీడాకారిణి ప్రతిభ గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.

రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ చేతుల మీదుగా అర్జున అవార్డు

సాహసే ధైర్యం...

హరియాణాలోని భైస్వాల్‌లో జన్మించింది దీపా మాలిక్​. చిన్ననాటి నుంచే ఆమెకు సాహోసోపేత క్రీడలంటే ఇష్టం. 1999లో వెన్నెముకలో చిన్న గడ్డ ఏర్పడటం వల్ల ఆసుపత్రి పాలైంది. ఫలితంగా వెనుకభాగంలో మూడు సర్జరీలు చేసి 183 కుట్లు వేశారు. అప్పట్నుంచి వీల్‌చైర్‌కే పరిమితమైనా... విభిన్న క్రీడా రంగాల్లో సత్తా చాటుతూ భారత్‌లో ఉత్తమ పారా అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది. యమునా నదిని ఈదడం, ప్రత్యేక మోటార్ బైక్‌లో చెన్నై నుంచి దిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల ప్రయాణం, హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో 8 రోజుల ప్రయాణం ఈమె సాహసాల్లో ప్రధానమైనవి.

సాహసక్రీడల్లో మేటి

ABOUT THE AUTHOR

...view details