S dhanalakshmi and Aishwarya babu: కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత జట్టులో డోపింగ్ కలకలం రేపింది. స్ప్రింటర్ ఎస్.ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోప్ పరీక్షల్లో విఫలమయ్యారు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడటంతో డోప్ పరీక్షల్లో వీరిద్దరు పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనకుండా ధనలక్ష్మి, ఐశ్వర్యలపై వేటుపడింది. రెండుసార్లు డోప్ పరీక్షలో విఫలమైన వీరిద్దరిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. ఏప్రిల్, మే నెలలో టర్కీలో శిక్షణ సందర్భంగా ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్యకు చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ధనలక్ష్మి శాంపిల్స్ సేకరించింది. ఆ తర్వాత జూన్‌లో తిరువనంతపురంలో శిక్షణ శిబిరం సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) శాంపిల్స్ తీసుకుంది. ఈ రెండు శాంపిల్స్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది.
కామన్వెల్త్ క్రీడల్లో 100 మీటర్లు, 4×100 మీ రిలే విభాగాలకు 24 ఏళ్ల ధనలక్ష్మి ఎంపికైంది. 4×100 మీ రిలేలో ద్యుతీ చంద్, హిమ దాస్, శ్రావణి నందా బరిలో ఉన్నారు. ప్రస్తుతం యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సైతం ధనలక్ష్మి ఎంపికైంది. అయితే వీసా సమస్యలతో ఆమె వెళ్లలేకపోయింది. ఈ ఏడాది జూన్ 26న కొసనోవ్ స్మారక అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల పరుగును 22.89 సెకన్లలో ముగించి కెరీర్ అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన ధనలక్ష్మి బంగారు పతకం సాధించింది. సరస్వతి సాహా (22.82 సె), హిమ దాస్ (22.88 సె) తర్వాత 23 సెకన్లలోపు టైమింగ్ నమోదు చేసిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.