ఫుట్‌బాల్ ప్రపంచంలో ఓ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల పేరు చెప్పమంటే.. అందులో కచ్చితంగా ఉండే పారు క్రిస్టియానో రొనాల్డో. ఎందుకంటే అతడు మైదానంలో తన విన్యాసాలతో క్రీడా ప్రేమికులను తెగ ఉర్రూతలూగిస్తుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. అలా ఇప్పటికే ఆటపరంగానూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రొనాల్డోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ సైతం అతడికి వీరాభిమానులు. అయితే ఇప్పుడతడికి ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది. దీంతో అతడు తీవ్ర నిరాశలో ఉన్నాడట. అయితే అది ఆటకు సంబంధించింది కాదు. తనకు, కుటుంబ సభ్యులకు రుచికరంగా వంట చేసిపెట్టే చెఫ్ దొరకడం లేదంట.
విషయానికొస్తే.. రొనాల్డో తన కుటుంబంతో కలిసి పోర్చుగల్‌కు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడట. ఇప్పటికే అక్కడ దాదాపు రూ.170కోట్ల విలువైన ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించే పనిలో పడ్డాడట. సెప్టెంబర్ 2021లో ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. జూన్ 2023 నాటికి ఆ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో భార్య, పిల్లలతో రొనాల్డో ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో ప్రకటించాడు. నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తో పాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే మాస్టర్ చెఫ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అతడికి నెలకు రూ.4.5 లక్షలు జీతం ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదట. దీంతో అతడు నిరాశ చెందినట్లు వార్తలు వస్తున్నాయి.