POLICE CAUTION TO RONALDO: ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఓ అభిమానితో అతడు దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని యూకేలోని మెర్సీసైడ్ పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
అసలేం జరిగిందంటే.. ఈ ఏడాది ఏప్రిల్ 9న గూడిసన్ పార్క్ వేదికగా జరిగిన ఎవర్టన్-మాంచెస్టర్ మ్యాచ్లో రొనాల్డో టీమ్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు పోడియంలోకి వెళ్తుండగా.. అభిమానులు హాయ్ చెబుతూ కరచాలనం ఇచ్చేందుకు పోటీపడ్డారు. అయితే ఈ క్రమంలోనే ఓటమి కోపంతో ఉన్న రొనాల్డో ఓ ప్రేక్షకుడి ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే ఈ సంఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా రొనాల్డ్ తీరుపై విమర్శలు చెలరేగాయి. దీంతో అతడు అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.