స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ యాదవ్.. ఓ హత్య కేసులో భాగంగా ఇటీవల అరెస్టయ్యాడు. మన దేశానికి చెందిన ఆటగాళ్లు ఇలా జైలుపాలవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో పలువురు భారతీయ క్రీడాకారులు అరెస్ట్ అయ్యారు. కొన్నేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. ఇంతకీ వాళ్లు ఎవరు? ఏ కారణంతో జైలుకు వెళ్లారు?
శ్రీశాంత్-క్రికెటర్
2012లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తప్పు ఒప్పుకోవడం వల్ల ఇతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. 2018లో బ్యాన్ ఎత్తివేసి, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అతడికి అనుమతిచ్చింది. 2020లో అతడిపై భారత బోర్డు విధించిన ఏడేళ్ల నిషేధం పూర్తయింది. దీంతో గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేరళ తరఫున ఆడాడు.
నవజ్యోత్ సింగ్ సిద్ధు- క్రికెటర్
పాటియాలాకు చెందిన ఓ వ్యక్తిని గాయపర్చడం సహా అతడి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధును 1991లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మూడేళ్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలోనే తన ఎంపీ పదవికీ రాజీనామా చేశాడు. అయితే 2018లో సుప్రీంకోర్టు.. ఈ కేసులో సిద్ధును నిర్దోషిగా ప్రకటించింది.