లియోనల్ మెస్సీ.. ఆదివారం(డిసెంబర్ 18) ఫిపా ఫైనల్ అద్భుత ప్రదర్శనతో తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇతడి నామ స్మరణే చేస్తోంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
సముద్ర గర్భంలో మెస్సీ కటౌట్.. ఏర్పాటు చేసింది కేరళ ఫ్యాన్స్ కాదట
ఈ మధ్య మెస్సీ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఎన్నో విన్నూత కార్యక్రమాలు చేశారు. అలా ఇటీవలే వైరల్‌గా మారిన మెస్సీ అండర్ వాటర్ కటౌట్ పై వచ్చిన వార్తల్లో ఓ చిన్న తప్పిదం జరిగింది. దాన్ని ఏర్పాటు చేసింది కేరళ వాసులు కాదట. ఇంతకీ ఎవరంటే?
అయితే ఈ క్రమంలోనే కొంతమంది మెస్సీ ఫ్యాన్స్ చేసిన ఓ పని సోషల్‌మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాళ్లు మెస్సీ కటౌట్‌ను అరేబియా సముద్రంలోని కవరట్టి దీవి సమీపంలో దాదాపు 100 అడుగుల లోతులో దిబ్బల మధ్య ఏర్పాటు చేసినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే దీనిని కేరళకు చెందిన వారు చేశారని జోరుగా ప్రచారం సాగింది.
అయితే ఇప్పుడు ఆ వార్తల్లో చిన్న పొరపాటు జరిగింది. అలా చేసింది కేరళకు చెందిన వారు కాదంట. దాన్ని ఏర్పాటు చేసింది లక్ష్యదీప్కు చెందిన ఓ వీరాభిమాని. మహమ్మద్ స్వాదీక్ అనే ఓ స్కూల్ పీఈటీ టీచర్ 15 మంది స్కూబా అడ్వెంచర్ టీమ్ సహాయంతో ఆ కటౌట్‌ను పెట్టాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు స్వయంగా ఆయనే ఓ న్యూస్ ఛానల్‌తో ఈ విషయాన్ని తెలిపారు. "నేను పుట్టి పెరిగిందంతా లక్ష్వదీప్లోనే. నేను మెస్సీకి వీరాభిమానిని. వృత్తిరీత్యా టీచర్‌గా ఉన్న నేను అప్పుడప్పుడూ కొన్నీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటాను. ఈ క్రమంలోనే మెస్సీ మీద నాకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఈ కటౌట్‌ను ఇక్కడున్న స్కూబా డైవర్ల సహాయంతో ఏర్పాటు చేశాను. ఇందులో ఏ ఒక్కరు కేరళ వాసులు లేరు." అని స్పష్టం చేశారు.