భారత మహిళా బాక్సర్లు మేరీకోమ్, నిఖత్ జరీన్ మధ్య విభేదాలంటూ వస్తోన్న వార్తలపై ట్విట్టర్ వేదికగా కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. వీరిద్దరూ దేశం గర్వించదగ్గ క్రీడాకారులని అన్నారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మేరీకి, నిఖత్ గట్టిపోటీ ఇవ్వడం గొప్ప విషయం అని చెప్పారు.
"ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో ఇప్పటివరకు ఏ క్రీడాకారిణులు సాధించని ఘనత మేరీకోమ్ సొంతం చేసుకుంది. అటువంటి మేరీపై పోరాడటానికి సిద్ధపడిన నిఖత్.. ఓ గొప్ప క్రీడాకారిణే. వీరిద్దరినీ చూసి దేశం గర్విస్తుంది. అభిరుచి, భావోద్వేగం ఆటలకు ఆత్మ లాంటివి. ప్లేయర్ల మధ్య పగ, ప్రతీకారం ఉంటే ఆటల్లో రాణించడం కష్టం"
- కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడా మంత్రి
చైనా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న ఒలింపిక్ అర్హత పోటీల్లో చోటు కోసం మేరీకోమ్, నిఖత్.. శనివారం తలపడ్డారు. 9-1 తేడాతో మేరీ గెలిచింది. ఆట ముగిసిన తర్వాత ప్రత్యర్థికి కరచాలనం ఇచ్చేందుకు నిరాకరించిందీ బాక్సర్. ఆమెపైన విమర్శలు గుప్పించింది.