తెలంగాణ

telangana

ETV Bharat / sports

Pinki Pramanik Biopic : త్వరలో తెరపైకి అథ్లెట్ పింకీ ప్రామాణిక్ బయోపిక్ - Controversial athlete pinki pramanik biopic in bollywood

మారుమూల పల్లె నుంచి వచ్చిన పింకీ ప్రామాణిక్‌.. అహోరాత్రులు శ్రమించి.. అంతర్జాతీయ స్థాయిలో స్ప్రింటర్​గా ఎన్నో పతకాలు సాధించింది. త్వరలో ఒలింపిక్స్​లో పాల్గొని తన కల నెలవేర్చుకుందామనుకుంది. ఇంతలో.. ఆమె బ్యాగ్​లో ఎవరో ఆయుధాలు పెట్టడంతో ఆ కేసులో అరెస్టయింది. ఆయుధాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో ఎలాగోలా అందులో నుంచి బయటపడింది. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో.. ఇంకొన్ని రోజుల్లో తను చిన్ననాటి నుంచి కన్న కల నెరవేరనున్న తరుణంలో.. తోటి క్రీడాకారిణి చేసిన ఆరోపణలు ఆమె జీవితాన్ని తలకిందులు చేశాయి. ఆమె లింగంపై లేవనెత్తిన ప్రశ్నలతో.. దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపింది. 22 ఏళ్ల వయస్సులో.. మగవాళ్లున్న సెల్​లో.. చేదు అనుభవాలు.. సూటిపోటి మాటలు.. అసభ్యకరమైన ప్రవర్తన.. మృగాళ్ల చూపులు.. వంటి ఎన్నో ఆటుపోట్లను దాటుకుని తనపై వచ్చిన ఆరోపణలు అసత్యాలని తేలేవరకు ఒంటరి పోరాటం చేసింది. ఇప్పటివరకు కష్టపడి.. అనుకున్నది సాధించిన వారి బయోపిక్​లు చూసిన మనం.. త్వరలో ఈ ఫెయిల్యూర్ ఫైటర్ జీవితాన్ని తెరపై చూడబోతున్నాం.

Pinki Pramanik Biopic
పింకీ ప్రామాణిక్ బయోపిక్

By

Published : Jul 18, 2021, 2:57 PM IST

ఇప్పటికే క్రీడాకారుల బయోపిక్స్‌ వచ్చాయి, వస్తున్నాయి. ప్రముఖుల గురించి ఇలా తీయడం సాధారణమేగా అనిపిస్తోంది కదూ. కానీ ఈసారి వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం పెద్ద తెర మీద కనిపించనుంది. మరి ఒక సినిమాకు సరిపోయేంతగా ఏముంది తన జీవితంలో...?

దుమారం రేపిన ఆరోపణలు..

పింకీ ప్రామాణిక్‌..పశ్చిమ్‌ బంగాలోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది. స్ప్రింటర్‌గా అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో బంగారు, వెండి పతకాలనూ గెలిచింది. త్వరలో ఒలింపిక్స్‌ కలను నిజం చేసుకోబోతోందనగా ఆమె జీవితం తలకిందులైంది. తనతోపాటు నివసించే ఒకమ్మాయి పింకీ తనపై అత్యాచారం చేసిందనీ, తనసలు అమ్మాయే కాదని కేసు పెట్టింది. దీంతో పింకీ పరుగే కాకుండా రైల్వేలో ఉద్యోగానికీ దూరమైంది.

దుర్భర జీవితం..

22 ఏళ్ల వయసులో జైల్లో మగవాళ్ల సెల్‌లో గడిపింది. అరెస్ట్‌ చేసినపుడూ, కోర్టుకు తీసుకెళ్లేటపుడూ మహిళా కానిస్టేబుల్స్‌ ఉండే వారు కాదు. మగ పోలీసులే తోడు వచ్చేవారు. వారు ఆమెతో ప్రవర్తించిన తీరు అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది.

ఆయుధాల కేసులో..

రెండు సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత 2014లో ఆమెపై ఆరోపణలన్నీ అసత్యాలని తేలడంతో కోల్‌కతా హైకోర్టు కేసు కొట్టేసింది. మళ్లీ ఉద్యోగం లభించినా ఆటకీ, తన కలకీ దూరమైంది. దీనికి ముందూ పింకీ ఆయుధాల కేసులో జైలుకెళ్లింది. ఎవరో ఆమెకు తెలియకుండా బ్యాగులో పెట్టిన ఆధారాలు దొరకడంతో ఆ కేసు కొట్టేశారు. దీన్నుంచీ బయటపడటానికే ఆమెకు చాలా కాలం పట్టింది కూడా.

తాజాగా బాలీవుడ్‌ నిర్మాత అశోక్‌ పండిట్‌ ఈమె బయోపిక్‌ను తీయబోతున్నట్లు ప్రకటించారు. వివాదాలతో కూడిన ఈమె జీవిత కథను ఎంచుకోవడం చర్చనీయాంశ మైంది. ‘పింకీ ఒకప్పుడు దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ఆమె విజయాలను దేశమంతా సంబరాలు చేసుకుంది. కానీ తర్వాత ఆమె లింగమే ప్రశ్నార్థకమైంది. మానభంగ ఆరోపణతో క్రీడా కెరియరే ముగిసింది. కానీ పోరాడి గెలిచింది. ఆమె పోరాటాన్ని అందరికీ తెలియజేయాలని పించింది’ అంటోంది రచయిత ప్రియాంక ఘటక్‌. ఇలాగైనా తన కష్టాలు, పోరాడిన తీరు అందరికీ తెలియజేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందంటోంది పింకీ. తారాగణం, తదితర వివరాలు త్వరలో చెబుతామంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details