కామన్వెల్త్ క్రీడలకు సమయం దగ్గర పడుతోంది. ఇంకో ఎనిమిది రోజుల్లోనే ఆటలు మొదలవుతున్నాయి. ఈసారి క్రీడల్లో షూటింగ్ లేకపోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ కొత్తగా వేరే ఆటలు కామన్వెల్త్‌లో భాగం కాబోతున్నాయి. అందులో బాస్కెట్‌బాల్ 3×3, వీల్ ఛైర్ బాస్కెట్‌బాల్, పారా టేబుల్ టెన్నిస్‌లతో పాటు మహిళల క్రికెట్ కూడా ఉండడం విశేషం. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు జరిగాయి కానీ.. మహిళల క్రికెట్ ఇందులో భాగం కావడం ఇదే తొలిసారి. ఈ నెల 28న మొదలయ్యే కామన్వెల్త్ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో మహిళల క్రికెట్ చూడబోతున్నాం. టోర్నీకి ఎనిమిది జట్లు ఎంపిక కాగా.. భారత మహిళల జట్టు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్‌లతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ల తర్వాత రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఇటీవలే శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్న హర్మన్‌ప్రీత్ సేన.. ఇదే జోరు కొనసాగిస్తే కామన్వెల్త్ క్రికెట్లో పతకం గెలవడం కష్టమేమీ కాదు. పసిడి రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురు కావచ్చు. 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆగస్టు 7న ఫైనల్ జరుగుతుంది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం..:భారత్, పాకిస్థాన్ జట్లు ఎక్కడ, ఏ ఆటలో తలపడ్డా క్రీడాభిమానుల్లో ఉండే ఆసక్తే వేరు. కామన్వెల్త్ క్రీడలకు కూడా వీటి పోరే ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. తొలిసారి మహిళల క్రికెట్ కామన్వెల్త్ క్రీడల్లో అరంగేట్రం చేస్తుండగా.. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండడంతో లీగ్ దశలోనే చిరకాల ప్రత్యర్థుల పోరు చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఈ నెల 31న జరగనున్న ఈ మ్యాచ్ పట్ల స్థానిక అభిమానుల్లో అమితాసక్తి నెలకొందని, దీని కోసం పెద్ద ఎత్తున టికెట్లు కొంటున్నారని బర్మింగ్‌హామ్ క్రీడల నిర్వాహకులు వెల్లడించారు. మొత్తంగా కామన్వెల్త్ క్రీడలు చూసేందుకు ఇప్పటిదాకా 12 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు.