తెలంగాణ

telangana

ETV Bharat / sports

commonwealth games 2022: జూడోలో రజతం.. వెయిట్​ లిఫ్టింగ్​, హైజంప్​లో కాంస్యాలు - స్క్వాష్‌ సింగిల్స్‌లో కాంస్యం

Commonwealth games 2022 India: కామన్వెల్త్‌ క్రీడల్లో తూలిక మాన్‌ అదరగొట్టింది. జూడోలో దేశానికి మరో రజతాన్ని అందించింది. అంచనాలను మించి.. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆమె.. తుదిపోరులో తడబడింది. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌, హైజంప్​లోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక, స్క్వాష్‌ సింగిల్స్‌లో కాంస్యంతో సౌరభ్‌ చరిత్ర సృష్టించాడు. జోరు మీదున్న బాక్సర్లు సెమీస్‌ చేరి పతకాలు ఖాయం చేశారు.

commonwealth games 2022
కామన్వెల్త్‌ క్రీడలు

By

Published : Aug 4, 2022, 8:01 AM IST

Commonwealth games 2022 medals: కామన్వెల్త్‌ క్రీడల జూడోలో భారత్‌కు మూడో పతకం దక్కింది. ఇప్పటికే సుశీల దేవి రజతం, విజయ్‌ కుమార్‌ కాంస్యం నెగ్గగా.. తాజాగా తూలిక మాన్‌ వెండి పతకం పట్టేసింది. బుధవారం మహిళల +78 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 1ఎస్‌2-10 తేడాతో సారా అడ్లింగ్‌టాన్‌ (స్కాట్లాండ్‌) చేతిలో ఓడింది. తొలిసారి ఈ క్రీడల్లో బరిలో దిగిన తూలిక.. మెరుగైన ప్రదర్శనతో తుది పోరు చేరింది. సెమీస్‌లో ఓ దశలో వెనకబడ్డ ఆమె తిరిగి పుంజుకుని 'ఇప్పాన్‌' (ప్రత్యర్థి వీపును మ్యాట్‌కు తగిలేలా తోయడం లేదా 20 సెకన్ల పాటు ప్రత్యర్థిని లేవకుండా ఉంచడం)తో ఆండ్రూస్‌ (న్యూజిలాండ్‌)ను చిత్తుచేసింది. ఆమె జోరు చూస్తుంటే పసిడి దక్కుతుందనిపించింది. కానీ ఫైనల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించలేకపోయింది. ఇప్పాన్‌తోనే సారా గెలిచింది. ఈ ఓటమి తర్వాత తూలిక షాక్‌లో కనిపించింది. మరోవైపు పురుషుల 100 కేజీల విభాగం రెపిఛేజ్‌ రౌండ్లో దీపక్‌.. హెవిట్‌ (ఇంగ్లాండ్‌) చేతిలో ఓడిపోయాడు.

స్క్వాష్‌లో సౌరభ్‌ చరిత్ర:

వెటరన్‌ స్క్వాష్‌ స్టార్‌ సౌరభ్‌ ఘోషల్‌ చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో స్క్వాష్‌ సింగిల్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్‌లో అతను కాంస్యం సాధించాడు. కంచు పతక పోరులో ఈ 35 ఏళ్ల పశ్చిమ బెంగాల్‌ ఆటగాడు 11-6, 11-1, 11-4తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జేమ్స్‌ విల్స్‌ట్రాప్‌ (ఇంగ్లాండ్‌)ను చిత్తుచేశాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన సౌరభ్‌ వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. అతనికిది రెండో కామన్వెల్త్‌ క్రీడల పతకం. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పల్లికల్‌తో కలిసి అతను రజతం గెలిచాడు. ఈ ఏడాది ప్రపంచ డబుల్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఆమెతో కలిసి అతను ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2014 ఆసియా క్రీడల్లో సింగిల్స్‌లో రజతం నెగ్గిన అతను.. టీమ్‌ విభాగంలో పసిడి ఖాతాలో వేసుకున్నాడు.

ప్రిక్వార్టర్స్‌లో జోష్న జోడీ:

స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప, హరిందర్‌ పాల్‌ సింగ్‌ సంధు జోడీ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. బుధవారం ఈ జంట 8-11, 11-4, 11-3తో యెహేని కురుప్పు-రవిందు లక్సిరి (శ్రీలంక) ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను కోల్పోయాక భారత జోడీ బలంగా పుంజుకుంది. పెద్దగా శ్రమించకుండానే తర్వాతి రెండు గేములను గెలుచుకుంది.

లవ్‌ప్రీత్‌కు కాంస్యం:

కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్‌ సింగ్‌ కాంస్యం గెలిచాడు. మొత్తం 355 కిలోలెత్తి (163+192) మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో తొలి మూడు ప్రయత్నాల్లో అతను వరుసగా 157, 161, 163 కేజీలెత్తాడు. స్నాచ్‌ విభాగం ముగిసే సరికి బెసెట్టె (కెనడా)తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తొలి రెండు సార్లు 185, 189 కేజీలెత్తిన అతను.. మూడో ప్రయత్నంలో 192 కేజీలతో జాతీయ రికార్డు సృష్టించాడు. జూనియర్‌ పెరిక్లెక్స్‌ (361 కేజీలు, కామెరూన్‌) స్వర్ణం, జాక్‌ (358 కేజీలు, సమోవా) రజతం నెగ్గారు. లుధియానాకు చెందిన దర్జీ తనయుడైన 24 ఏళ్ల లవ్‌ప్రీత్‌కు ఇవే తొలి కామన్వెల్త్‌ క్రీడలు. మరోవైపు మహిళల 87+ కేజీల విభాగంలో పూర్ణిమ పాండే (228 కేజీలు) ఆరో స్థానంలో నిలిచింది.

కంచు మోగించిన గుర్‌దీప్‌:

కామన్వెల్త్‌ క్రీడల్లో బుధవారం అర్ధరాత్రి తర్వాత భారత్‌ ఖాతాలో రెండు కాంస్యాలు చేరాయి. వెయిట్‌లిఫ్టర్‌ గుర్‌దీప్‌ సింగ్‌ (109+కేజీ) 390 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. గుర్‌దీప్‌ స్నాచ్‌లో 167 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 223 కిలోలు ఎత్తాడు. క్రీడల రికార్డు (405కేజీ)తో పాకిస్థాన్‌కు చెందిన దస్తగిర్‌ బట్‌ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. స్నాచ్‌లో 173 కిలోలు ఎత్తిన అతడు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 232 కిలోలు లేపాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఆండ్రూ (394కేజీ) రజతం గెలుచుకున్నాడు.

హైజంప్‌లో శంకర్‌కు కాంస్యం:
హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌.. 2022 కామన్వెల్త్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హైజంప్‌ పోటీలో అతను మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో 2.10, 2.15, 2.19, 2.22 మీటర్ల ఎత్తును అతను విజయవంతంగా దూకాడు. అయితే తర్వాత 2.25 మీటర్ల లక్ష్యంతో మూడు ప్రయత్నాలు చేసినా అతను విజయవంతం కాలేకపోయాడు. బాక్సింగ్‌లో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా నిరాశపరిచింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 2-3తో రోసీ ఎకిల్స్‌ (వేల్స్‌) చేతిలో పరాజయంపాలైంది.

కామన్వెల్త్‌లో ఈనాడు

  • అథ్లెటిక్స్‌: పురుషుల లాంగ్‌ జంప్‌ ఫైనల్‌-మహ్మద్‌ అనీస్‌, శ్రీశంకర్‌ (అర్ధరాత్రి 12.12)
  • బాక్సింగ్‌:48-51 కేజీల క్వార్టర్స్‌-అమిత్‌ ఫంగాల్‌ (సా.4.45); 57-60 కేజీల క్వార్టర్స్‌-జాస్మిన్‌ లంబోరియా (సా.6.15);
  • హాకీ పురుషులు: భారత్‌× వేల్స్‌ (సా.6.30)
  • స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌:దీపిక పల్లికల్‌-సౌరభ్‌ ఘోషల్‌ (రా.7); జోష్న చిన్నప్ప-హరిందర్‌పాల్‌ (రా. 11)

ఇవీ చదవండి:వెయిట్​లిఫ్టింగ్​లో​ కాంస్యం.. హాకీ, బాక్సింగ్​లో భారత్​ జోరు

'ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌..' ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ఐసీసీకి ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details