Commonwealth games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో జోరు మీదున్న భారత జట్టుకు పరాభవం ఎదురైంది. మహిళల హాకీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. తొలుత 1-1తో మ్యాచ్ డ్రా కాగా.. పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన షూటౌట్లో 3-0 తేడాతో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంబ్రోషియా మాలోన్, కైటిలిన్ నాబ్స్, అమీ లావ్టన్ గోల్ కొట్టగా.. భారత క్రీడాకారిణులు నవనత్ కౌర్, నేహా కొట్టలేకపోయారు. దీంతో ఆదివారం కాంస్య పతకం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.
మ్యాచ్ ఆరంభమైన పది నిమిషాల్లోనే ఆస్ట్రేలియా క్రీడాకారిణి రెబెకా గ్రేయినర్ గోల్ కొట్టింది. తొలి అర్ధభాగంలో భారత్ ఒక్క గోల్ సాధించకపోయినా.. ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. తిరిగి ప్రారంభమైన తర్వాత భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించిన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. లాల్రెమ్సియామి కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను ఆస్ట్రేలియా గోల్ కీపర్ అలేషియా పవార్ అడ్డుకుంది. మ్యాచ్ చివరి అంకానికి చేరుకున్నాక 49 నిమిషంలో వందన కటారియా గోల్ కొట్టి భారత్‌ను రేసులో నిలబెట్టింది.
ఆంపైర్ తీరుపై వ్యతిరేకత: మ్యాచ్ 1-1తో డ్రా కావడం వల్ల పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. మొదట ఆస్ట్రేలియా క్రీడాకారిణి అంబ్రోషియా మాలోన్ కొట్టిన గోల్‌ను భారత గోల్‌కీపర్ సవితా పూనియా తిప్పికొట్టింది. కానీ గడియారం సెట్ చేయలేదంటూ మహిళా అంపైర్.. అంబ్రోషియాకు మరో అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత కొట్టిన మూడు గోల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది ఆస్ట్రేలియా. అయితే, అంపైర్ తీరుపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆసీస్ ఆటగాళ్లకు అనుకూలంగా అంపైర్ వ్యవహరించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్లో ఛీటింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.