కామన్వెల్త్ క్రీడల్లో భారత పతక ప్రయాణం మొదలైంది. శనివారం వెయిట్‌లిఫ్టర్ల అద్భుత ప్రదర్శనతో ఒక్కరోజే మూడు పతకాలు వచ్చాయి. ఈ క్రీడల్లో దేశానికి పతకాలు అందించడంలో ముందుండే వెయిట్‌లిఫ్టర్లు ఈ సారీ ఆనవాయితీ కొనసాగించారు. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం, మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజతం నెగ్గారు. ఫేవరేట్‌గా బరిలో దిగిన చాను 201 కేజీల (88+113) ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల రికార్డు నెలకొల్పి పసిడి పట్టేసింది. ప్రత్యర్థులెవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు. రెండో స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు ఆమె ప్రదర్శనకు మధ్య 29 కేజీల అంతరం ఉంది. చాను స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీలెత్తి మెరుగ్గా పోరు ఆరంభించింది.
ఆ తర్వాత 88 కేజీల ప్రదర్శన చేసి అగ్రస్థానంలో నిలిచింది. మూడో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తేందుకు విఫలమైంది. ఇక క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలోనే 109 కేజీల ప్రదర్శనతో బంగారు పతకం ఖాయం చేసుకుంది. రెండో ప్రయత్నంలో 113 కేజీల బరువెత్తి రికార్డు నెలకొల్పింది. చివరి ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తలేకపోయింది. అయినా ఏ ఇబ్బంది లేకుండా పోయింది. అప్పటికే బంగారు పతకం తన మెడలో వాలేందుకు సిద్ధమైంది. హనిత్ర (172 కేజీలు, మారిషస్), కమిన్స్కి (171 కేజీలు, కెనడా) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. అంతకుముందు సంకేత్ వెండి పతకంతో భారత్ ఖాతా తెరిచాడు. పసిడి సాధించేలా కనిపించిన అతణ్ని గాయం దెబ్బతీసింది.
కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణం చేజార్చుకున్నాడు. మొత్తం 248 కేజీల ప్రదర్శనతో ఈ 21 ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు రెండో స్థానానికి పరిమితమయ్యాడు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో 113 కేజీల (తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 107, 111 కేజీలు) బరువెత్తి ఆ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. తొలి ప్రయత్నంలోనే 135 కేజీల ప్రదర్శనతో మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. కానీ రెండో ప్రయత్నంలో (139 కేజీలు) ఆ బరువును ఛాతీ వరకు ఎత్తుకుని క్లీన్ పూర్తి చేసిన అతనికి.. దాన్ని తల మీదకు తీసుకు వచ్చే క్రమంలో కుడి మోచేతికి గాయమైంది. గాయం బాధిస్తున్నా మూడో ప్రయత్నం చేసి మరోసారి విఫలమయ్యాడు. అప్పటికీ అతనే అగ్రస్థానంలో ఉన్నాడు.
కానీ ఆ తర్వాత మహమ్మద్ అనిక్ (మలేసియా) 142 కేజీల బరువెత్తి పసిడి పట్టుకుపోయాడు. స్నాచ్‌లో 107 కేజీలు ఎత్తిన అతను.. మొత్తం 249 కేజీల ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల రికార్డు నమోదు చేశాడు. దిలంక (225 కేజీలు, శ్రీలంక) కాంస్యం గెలిచాడు. తర్వాత పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ కాంస్యం నెగ్గాడు. 269 (118+151) కేజీల ప్రదర్శనతో అతను మూడో స్థానంలో నిలిచాడు. అజ్నిల్ (285 కేజీలు, మలేసియా) కామన్వెల్త్ రికార్డుతో పసిడిని నిలబెట్టుకున్నాడు. మోరియా (273 కేజీలు, పపువా న్యూగినియా) రజతం నెగ్గాడు. స్నాచ్‌లో వరుసగా 115 కేజీలు, 118 కేజీలు ఎత్తిన గురురాజ.. మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్‌లో అతను మూడో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తి పతకం ఖాయం చేశాడు. 2018 క్రీడల్లో గురురాజ 56 కేజీల విభాగంలో రజతం నెగ్గాడు.
ఆమె సరికొత్తగా:టోక్యో ఒలింపిక్స్‌లో రజతం.. ఆ ఘనత సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర.. క్లీన్ అండ్ జర్క్‌లో 119 కేజీల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు.. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్న మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడూ సరికొత్తగా మార్చుకుంటోంది. అలసటను దరి చేరనీయలేదు. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. తన టెక్నిక్‌ను మరింత పటిష్ఠంగా మార్చుకోవాలనే ధ్యేయంతో సాగింది. శిక్షణను ఇంకా కఠిన తరం చేసింది. స్నాచ్‌లో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని అందుకునే దిశగా కష్టపడుతోంది. విదేశాల్లో ఉత్తమ వసతుల మధ్య అత్యుత్తమంగా ప్రాక్టీస్ కొనసాగించింది.
కామన్వెల్త్ క్రీడల్లో ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) చానును 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. తన బరువు పెంచుకుని.. ఆ విభాగానికి తగినట్లుగా ఆమె సిద్ధమైంది. అందుకోసం ఎంతగానో శ్రమించింది. కానీ ఒక్క విభాగం నుంచి అత్యుత్తమ వెయిట్‌లిఫ్టర్ మాత్రమే క్రీడలకు ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల్లోనే పోటీపడింది. ఇప్పటికే క్లీన్ అండ్ జర్క్‌లో 119 కేజీల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆమె.. స్నాచ్‌లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయడం లేదనే చెప్పాలి. ఈ కామన్వెల్త్ క్రీడల స్నాచ్‌లో 90 కేజీలు అందుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగింది. అందులో విఫలమైనప్పటికీ 88 కేజీలెత్తి తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో సరికొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లోనూ దూకుడు కొనసాగించి రికార్డుతో పతకం పట్టేసింది. 2014 గ్లాస్కో క్రీడల్లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఆమె.. ఇప్పుడు మరో పసిడి ఖాతాలో వేసుకుంది. ఇక ఇదే జోరులో స్నాచ్‌లో ప్రదర్శన మెరుగుపర్చుకుని.. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం రంగు మారుస్తుందేమో చూద్దాం.
మెరుగైన జీవితం కోసం..:కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ఓ చిన్న గ్రామం. అందులో ట్రక్ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుటుంబం. అతనికి ఆరుగురు కొడుకులు. అసలే పేదరికం. ఆ ఆరుగురిలో ఒకడైన ఆ కుర్రాడికి తమ ఆర్థిక పరిస్థితి మార్చాలనే తపన మొదలైంది. అందుకు ఆటలే మార్గమని నమ్మాడు. ఇప్పుడా ఆ ఆటలో గొప్పగా రాణిస్తున్నాడు. అతనే గురురాజ పూజారి. 2008 ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ కాంస్యం నెగ్గడం చూసిన అతను.. మొదట రెజ్లర్ కావాలనుకున్నాడు. కానీ తన కళాశాలలో కోచ్ సలహాతో వెయిట్‌లిఫ్టింగ్ వైపు సాగాడు.