Chirag Shetty Khel Ratna :2023 సంవత్సరానికిగాను భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నను అందుకోనున్నారు. ఈ సందర్భంగా చిరాగ్ శెట్టితో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించింది. దేశ అత్యున్నత పురస్కారం రావడం పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు చిరాగ్ శెట్టి తెలిపాడు.
"ఒక క్రీడాకారుడిగా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును అందుకోవడం నిజంగా గొప్ప గౌరవం. మనమందరం పతకాలు గెలవడానికి, ఉత్తమ గౌరవాలు పొందేందుకు కృషి చేస్తున్నాం. ఖేల్ రత్న అవార్డును సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లు మాకు బాగా కలిసొచ్చాయి" ఈటీవీ భారత్‌తో చిరాగ్ శెట్టి తెలిపాడు.
కోచ్‌గా చాలా ఆనందంగా ఉంది!
మరోవైపు, చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు అతడి మాజీ కోచ్ ఉదయ్ పవార్. మంబయిలో గోరేగావ్ స్పోర్ట్స్ క్లబ్‌కు కూడా ఇది గొప్ప గౌరవమని ఈటీవీ భారత్‌తో చెప్పాడు.
"ఖేల్‌రత్న పురస్కారం రావడం కేవలం చిరాగ్, సాత్విక్‌లకు మాత్రమే కాకుండా అతడి (చిరాగ్) తల్లిదండ్రులతోపాటు బ్యాడ్మింటన్ కుటుంబానికి కూడా గొప్ప గౌరవం. ఈ బ్యాడ్మింటన్ ఫ్యామిలీలో చిరాగ్ సహచరులు, మాజీ కోచ్‌లు ఉన్నారు. చిరాగ్ తన మాజీ సహచరులతో అందరితో సన్నిహితంగా ఉంటాడు. గోరేగావ్ స్పోర్ట్స్ క్లబ్‌లోని బ్యాడ్మింటన్ హాల్‌కు చిరాగ్ పేరు పెట్టాలని గతవారమే నిర్ణయించాం. అతడి కోచ్‌గా ఉన్నందుకు గర్విస్తున్నాను. ప్రస్తుత కోచ్ మాథియాస్కు అభినందనలు" అని ఈటీవీ భారత్‌తో తెలిపాడు.
"చిరాగ్ 12ఏళ్ల వయసులో అతడి తండ్రి (చంద్రశేఖర్ శెట్టి)కి క్రీడల పట్ల తనకు ఆసక్తి లేదని చెప్పాడు. అదే సమయంలో చిరాగ్ పేరెంట్స్‌ను నేను ఒప్పించాను. బ్యాడ్మింటన్‌కు పంపమని కోరాను. కావాలంటే అతడు స్పోర్ట్స్లో సక్సెస్ అవ్వకపోతే 20 ఏళ్ల వయసులో వేరే వృత్తిని ఎంచుకోవచ్చని చెప్పాను. ఇప్పుడు అదే విషయాన్ని అతడి తండ్రి నాకు గుర్తుచేశారు. ఆరోజు మీరు పట్టుబట్టకపోయింటే నేను క్రీడారంగంలోకి తన కుమారుడిని పంపకపోయేవాడిని అని చెప్పారు. ఎవరు ఏ రంగంలో దూసుకెళ్తారో ఎవరు చెప్పలేం" అని ఉదయ్ పవార్ తెలిపాడు.