తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చారిత్రక విజయంలో భాగమవ్వడం గొప్ప అనుభూతి ' - చెస్​ వార్తలు

చదరంగం టోర్నీల్లో ఒలింపిక్స్​లా భావించే ప్రతిష్ఠాత్మక చెస్ ఒలంపియాడ్​లో భారత్ స్వర్ణంతో మెరిసింది. ఈ విజయానికి కారణమైన 14 మంది ఆటగాళ్లలో ప్రజ్ఞానంద ఒకరు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అనుభవాలు పంచుకున్నాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి.

Chess Olympiad gold medallist Praggnanandhaa on Cloud Nine
ప్రజ్ఞానంద

By

Published : Sep 5, 2020, 6:01 AM IST

చెస్​ ఒలింపియాడ్​లో భారత్​ స్వర్ణం సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. తొలిసారిగా ఆన్​లైన్​ పద్ధతిలో నిర్వహించిన ఈ టోర్నీలో రష్యాతో హోరాహోరీగా తలపడింది భారత జట్టు. సాంకేతిక సమస్యలతో నిర్వాహకులు రెండు దేశాలను విజేతలుగా ప్రకటించారు. భారత్​ తరఫున పాల్గొన్న 14 మందిలో ప్రజ్ఞానంద ఒకరు. తాజాగా తన అనుభవాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.

ప్రజ్ఞానంద ఇంటర్వ్యూ

ప్ర: చెస్ ఒలింపియాడ్‌లో భారత్​ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి. ఈ గొప్ప ఘనతను మీరు ఏ విధంగా భావిస్తున్నారు?

నాకు చాలా సంతోషంగా ఉంది. నా పాఠశాల, కోచ్​ రమేశ్​, స్పాన్సర్స్​ తదితరులు నాకు మద్దతుగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ చారిత్రక విజయంలో నేను కూడా భాగస్వామినవ్వడం నిజంగా గొప్ప అనుభూతి.

ప్ర: కరోనా పరిస్థితుల మధ్య టోర్నమెంట్​ కోసం ట్రైనింగ్​ను ఎలా తీసుకున్నారు?

నా కోచ్​ రమేశ్​ ఆన్​లైన్​లో శిక్షణ ఇచ్చారు. రోజూ ప్రత్యేక క్లాసులు తీసుకునేవారు. లాక్​డౌన్​ కారణంగా నేను కూడా ఆన్​లైన్​ శిక్షణకు అలవాటుపడ్డా.

ప్రజ్ఞానంద

ప్ర: చెస్ ఒలింపియాడ్ ఆన్‌లైన్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి కదా. మీ అనుభవాన్ని పంచుకుంటారా?

ఎలాంటి ఆన్​లైన్​ పోటీల్లోనైనా ఇంటర్నెట్​ కనెక్టివిటీ పెద్ద సమస్య. అంతర్జాల సేవలో అంతరాయం ఉన్నందునే.. భారత్​ మూడు ఆటల్లో దురదృష్టవశాత్తు ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక యాప్​ను డౌన్​లోడ్​ చేశాం. అప్పుడు కనెక్టివిటీలో ఎటువంటి సమస్య రాలేదు.

ప్ర: టోర్నమెంటులో సీనియర్లతో పోటీపడ్డారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న జట్టులో మీరు ఉన్నారు. వారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు.?

ఆట గురించి చర్చించడానికి విశ్వనాథన్​ ఆనంద్​ ఇంటికి చాలాసార్లు వెళ్లా. అయితే, ఆన్​లైన్​లో నిర్వహించిన ఈ టోర్నమెంటు కోసం నేను ఇతరులతో పెద్దగా చర్చించలేకపోయా. అయితే, ఆట ప్రారంభానికి ముందు మా జట్టులోని తోటి ఆటగాళ్లతో క్లుప్తంగా చర్చించేవాడిని.

ప్ర: చెస్ పట్ల మీకున్న అభిరుచికి కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు లభించేది?

నేను శిక్షణ పొందేందుకు ఒలింపియాడ్​లో పాల్గొనే ఇతర ఆటగాళ్లతో ఆడటం ప్రారంభించినప్పుడు.. తరచుగా ఇంటర్నెట్​ సమస్య ఎదుర్కొన్నా. ఇది చూసి నా తల్లిదండ్రులు ఇంట్లో సురక్షితమైన ఇంటర్నెట్​ కనెక్షన్​ను ఏర్పాటు చేశారు. ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆట సాగింది. మా బంధువులను కూడా ఇంటికి రావొద్దని చెప్పారు. వారు నాకు చాలా మద్దతుగా నిలిచారు. అదే నాలో గొప్ప ధైర్యాన్ని పెంచింది.

ప్రజ్ఞానంద

ప్ర: ఓ వైపు చదరంగం ఆడుతూ.. చదువుపైనా ఎలా ఏకాగ్రత సాధిస్తున్నారు. రెండింటి మధ్య ఎలా సమతుల్యం పాటిస్తున్నారు?

చెస్​ను కొనసాగిస్తూ టోర్నమెంటులో పాల్గొనేందుకు వీలు కల్పించి.. మూడేళ్లుగా నాకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన నా పాఠశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నా. చదువుపైనా ఎక్కువ దృష్టి పెట్టాలి.

ABOUT THE AUTHOR

...view details