గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్‌లో మన్‌కౌర్ అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె వయసు 100 ఏళ్లు పైన ఉండడమే. నడవడమే అత్యంత కష్టమైన వయసులో పరుగెత్తడం అంటే మాటలా..!! కానీ మన్‌కౌర్ చాలా సులభంగా పరుగు తీసి అందర్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 100మీ పరుగులో తన వయసు కేటగిరిలో ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. వందేళ్లు దాటిన వాళ్లు పరుగెత్తే 100మీ రేసు కేటగిరిలో మన్‌కౌర్ రెండేళ్ల నుంచి ఉత్సాహంగా బరిలో దిగుతోంది. 'చండీగఢ్ అద్భుతం' అంటూ విదేశీ పత్రికలు ఆమె ఘనతల గురించి కథనాలు ప్రచురించాయి.
2019 ఏడాదిలో మహిళా సాధికారత కృషికి గానూ మన్‌కౌర్‌కు మార్చి 8న ప్రతిష్టాత్మక నారి శక్తి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనుందని ఆమె కుమారుడు తెలిపాడు. ఈ గౌరవం తన అమ్మకు దక్కటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు.
94 ఏళ్ల వయసులో..
మన్‌కౌర్ మొదటి నుంచి అథ్లెట్ కాదు. 90 ఏళ్లు దాటిన తర్వాతే ఆమె పరుగు మొదలుపెట్టింది. 82 ఏళ్ల కొడుకు గుర్‌దేవ్‌సింగ్ అథ్లెట్ కావడం ఆమెకు కలిసొచ్చింది. అమ్మకు గుండె సమస్యలు, మోకాలి నొప్పులు ఏమీ లేకపోవడం వల్ల ఆమె మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు. కానీ పరుగంటే మక్కువ చూపిన ఆమె.. పోటీల్లోనూ పాల్గొనడం ప్రారంభించింది. ఇప్పటిదాకా కౌర్ 20 అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంది.
"ప్రతిరోజూ బాగా తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అనారోగ్యకరమైన పదార్థాల జోలికి వెళ్లొద్దు. అందరితో స్నేహంగా ఉండాలి. ఈ అలవాట్లే మంచి ఆరోగ్యాన్నిస్తాయి. ఓపిక ఉన్నంత వరకు పరుగెత్తుతూనే ఉంటా"