ప్రాణాంతక వైరస్ కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) #సేఫ్‌హ్యాండ్స్ ఛాలెంజ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలను కోరింది. ఇందులో చేతులను 20 సెకన్లలో సబ్బుతో ఎలా శుభ్రం చేసుకోవాలో చెబుతూ, ఓ వీడియోనూ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ముందుకొచ్చి సవాలును స్వీకరించారు. వారిలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, ప్రముఖ అథ్లెట్లు పీవీ సింధు, హిమదాస్, మరియా షరపోవా, కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు, నటీమణులు అనుష్కశర్మ, దీపిక పదుకొణె ఉన్నారు.
సచిన్
సేఫ్ హ్యాండ్స్ సవాలును స్వీకరించిన సచిన్.. అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు. ఎప్పుడూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నాడు.
హిమదాస్
భారత అథ్లెట్ హిమదాస్, సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ పూర్తి చేసి, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, సానియా మీర్జా, కిరణ్ రిజిజు, టైగర్ ష్రాప్, సచిన్‌లకు సవాలు విసిరింది.
సింధు
తెలుగు తేజం స్టార్ షట్లర్ పీవీ సింధు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సవాలును స్వీకరించింది. అందరూ దీనిని ప్రయత్నిస్తే కరోనా వ్యాప్తిని తగ్గించొచ్చని చెప్పింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సానియా మీర్జాలకు సవాలు విసిరింది.
కిరణ్‌రిజిజు
పీవీ సింధు, హిమదాస్ విసిరిన సవాల్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వీకరించారు. చేతులు శుభ్రం చేసిన వీడియోను పోస్ట్ చేసి... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బత్రాకు ఛాలెంజ్ చేశారు.
అనుష్క శర్మ, దీపికా పదుకొణె
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ట్యాగ్ చేసి సవాలు విసిరిన హీరోయిన్లలో అనుష్క శర్మ, దీపికా పదుకొణె ఒకరు. స్వీకరించిన వీరిద్దరూ, చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియోలను పోస్ట్ చేశారు. అనంతరం విరాట్ కోహ్లీ, ఫుట్‌బాలర్ రొనాల్డో, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు సవాల్ విసిరారు.
ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచి... టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరియా షరపోవా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే కరోనా(కొవిడ్-19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7వేల మందికి పైగా మరణించగా.. లక్షా 82వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి : గాడిద పిల్ల, గుర్రం పిల్లతో టెర్మినేటర్ హీరో