magnus carlsen world championship: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్.. చదరంగంలో అత్యున్నత టోర్నీ. పెద్ద పెద్ద క్రీడాకారులు కూడా అందులో పోటీ పడడాన్నే గౌరవంగా భావిస్తారు. ఇక అందులో టైటిల్ గెలిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. అలా అని ఒకసారి విజేతగా నిలిస్తే అంతటితో సంతృప్తి పడిపోరు. మళ్లీ మళ్లీ గెలవాలనే చూస్తారు. కానీ నార్వే చెస్ మేధావి మాగ్నస్ కార్ల్‌సన్‌కు మాత్రం ప్రతిసారీ తనే గెలుస్తుండడం బోర్ కొట్టేస్తోందట. 2013 నుంచి రికార్డు స్థాయిలో అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ నెగ్గిన కార్ల్‌సన్.. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.
"నాకు మరో మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన ప్రేరణ లభించట్లేదు. కొత్తగా నేనేం సాధిస్తాననే భావన కలుగుతోంది. ఇది నాకు నచ్చట్లేదు. కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. కానీ నాకైతే అందులో ఆడేందుకు ఎలాంటి ఆసక్తి లేదు. అందుకే దూరం కావాలని అనుకుంటున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి నేను దూరం కావాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. భవిష్యత్తులో ఇందులోకి పునరాగమనం చేసే అవకాశాలను కొట్టిపారేయలేను. అయితే ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. నేను చెస్ నుంచి రిటైర్ కావట్లేదు. ఆటలో చురుగ్గానే ఉంటా. ఇప్పుడు గ్రాండ్ చెస్ టూర్ కోసం క్రొయేషియాకు వెళ్లబోతున్నా. అక్కడి నుంచి చెస్ ఒలింపియాడ్ ఆడేందుకు చెన్నైకి చేరుకుంటా. అది చాలా ఆసక్తికరమైన టోర్నీ" అని ఒక పాడ్‌కాస్ట్‌లో కార్ల్‌సన్ ప్రకటించాడు.