అన్లాక్-4 ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 21 నుంచి 100 మందితో కూడిన క్రీడా సమావేశాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, జనాలు ఎప్పుడు స్టేడియాలకు తిరిగి వస్తారో సరిగ్గా చెప్పలేమని క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆటగాళ్లకు ఆన్లైన్ శిక్షణ అందించేందుకు బైచుంగ్ భూటియా ఫుట్బాల్ స్కూల్ రూపొందించిన ఎన్జోగో అనే యాప్ లాంచ్ వర్చువల్ వేడుకలో పాల్గొన్న రిజిజు.. ఈ సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు.
"స్టేడియానికి ప్రేక్షకులను అనుమతించడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే 1, 2 నెలల్లో కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. వీలైనంత త్వరగా అభిమానులను స్టేడియాల్లోకి రప్పించాలని నేను కూడా కోరుకుంటున్నా. త్వరలోనే ఇది జరగాలని ఆశిస్తున్నాం. అయితే, ప్రజల ఆరోగ్యం, భద్రత కూడా మా ప్రాధాన్యం."