తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీలో నిరసనలు.. WFI ప్రెసిడెంట్ X భారత రెజ్లర్లు.. అసలేం జరుగుతోంది?

రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆప్​ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్​, భారత రెజ్లర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని, అప్పటిదాకా ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ తాము పాల్గొనబోమని రెజర్లు స్పష్టం చేశారు. అయితే గత పదేళ్లుగా రెజ్లర్లుకు రాని ఇబ్బందులు కొత్త నియమాలు పెట్టాక వచ్చాయా అంటూ భూషన్​ సింగ్ ప్రశ్నించారు.

brij-bhushan-sharan-singh-and-coaches-sexually-exploited-wrestlers-alleges-vinesh-phogat
brij-bhushan-sharan-singh-and-coaches-sexually-exploited-wrestlers-alleges-vinesh-phogat

By

Published : Jan 18, 2023, 6:35 PM IST

రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియాకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​ ఎదుట ఆందోళనకు దిగారు రెజ్లర్లు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌, కోచ్‌లపై స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన ఆరోపణలు చేసింది. మహిళా రెజ్లర్లను వారు లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన వల్ల తాను ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. "మహిళా రెజ్లర్లను బ్రిజ్‌ భూషణ్‌, జాతీయ కోచ్‌లు లైంగికంగా వేధించారు. నన్ను ఎందుకూ పనికిరావని తిట్టారు. బ్రిజ్‌ భూషణ్‌ వేధింపుల వల్ల నేను ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. మా గాయాల గురించి ఎవరూ పట్టించుకోరు. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గతంలో నన్ను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయి" అంటూ విలేకరుల సమావేశంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. మీడియా ముందు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

రెజ్లర్లను కొట్టేవారు: భజరంగ్‌ పూనియా
మరో స్టార్‌ రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా కూడా మీడియాతో మాట్లాడారు. "ఫెడరేషన్‌లో ఉన్నవారికి ఆట గురించి ఏ మాత్రం తెలియదు. రెజ్లర్లను వారు చాలా వేధిస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ మమ్మల్ని తిట్టేవారు. కొట్టారు కూడా. మా పోరాటం ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాపై కాదు. కేవలం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌పైనే" అని చెప్పాడు. ఈ ఆందోళనలో పూనియా, ఫొగాట్‌, సాక్షిమాలిక్‌, సంగీతా ఫొగాట్‌, సుమిత్‌ మాలిక్‌, సరితా మోర్‌ సహా 30 మంది స్టార్‌ రెజ్లర్లు పాల్గొన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అప్పటిదాకా ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు.

పదవికి రాజీనామా చేయను.. విచారణకు సిద్ధం: WFI ప్రెసిడెంట్
అయితే భారత రెజ్లర్ల ఆందోళనలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. గత పదేళ్లుగా ఫెడరేషన్​తో ఎలాంటి ఇబ్బందులు రాని రెజర్లకు.. కొత్త నిబంధనలు తీసుకొచ్చాక వచ్చాయా అని ప్రశ్నించారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ల వెనుక ఓ పారిశ్రామిక వేత్త ఉన్నారేమోనని తనకు అనుమానం వస్తుందని ఆయన అన్నారు. తాను పదవికి రాజీనామా చేయనని, పోలీసులు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని.. ఒక్కటి నిరూపించినా శిక్షకు సిద్ధమని తెలిపారు. ప్రాణహాని వస్తే వినేష్​ ఫొగాట్​ పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. కాగా, 2011 నుంచి బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భాజపా నేత అయిన భూషణ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details