ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఇకలేడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ దిగ్గజ ఆటగాడు కన్నుమూశాడు. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. బ్రెజిల్‌కు చెందిన పీలే వయసు 82 ఏళ్లు. ఆయన గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటుండగా.. ఇటీవల ఆరోగ్యం విషమించి వివిధ అవయవాలు పని చేయడం మానేశాయి. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే.. కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. ఫుట్‌బాల్‌లో మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే. మంత్రముగ్ధమైన తన ఆటతో రెండు దశాబ్దాల పాటు సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగించిన పీలే.. తన తరంలోనే కాక మొత్తంగా ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.
అద్భుతం చేశాడు.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పీలే ఆట అద్భుతం. అతని ప్రదర్శన బ్రెజిల్‌కు వరం. నాలుగు ప్రపంచకప్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ఫార్వర్డ్‌గా, అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా మైదానంలో అతని విన్యాసాలు అసాధారణం. మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంలో అతనికి అతనే సాటి. ఏదో శక్తి మైదానంలో పరుగెడుతున్నట్లుగా.. విద్యుత్‌కు రూపం ఇస్తే అతనిలాగే ఉంటుందన్నట్లుగా దూసుకెళ్లేవాడు. రెండు కాళ్లతోనూ బంతిని నియంత్రించే అతను.. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది ప్రత్యర్థి ఆటగాళ్లు ఉన్నా బంతిని డ్రిబ్లింగ్ చేయడంలో అతని శైలే వేరు. గాల్లో వేగంగా వచ్చే బంతిని ఛాతీతో నియంత్రించి.. అది కిందపడి పైకి లేవగానే కాలుతో సూటిగా తన్ని గోల్‌పోస్టులోకి పంపించడంలో అతని ప్రత్యేకతే వేరు. గోల్‌కీపర్ అక్కడే ఉన్నా.. ఎంతగా ప్రయత్నించినా బంతిని ఆపడం మాత్రం అసాధ్యంగా ఉండేది. కనురెప్ప పాటులో బంతి నెట్‌ను ముద్దాడేది. ఈ తరం అభిమానులకు పీలే ఆట గురించి అంతగా తెలిసి ఉండదు. కానీ యూట్యూబ్‌లోకి వెళ్లి ‘పీలే టాప్ 5 గోల్స్’ అని కొడితే ఫిఫా అధికారిక ఛానెల్‌లో వీడియో ఉంటుంది. అందులో కేవలం ప్రపంచకప్‌ల్లోని అతని ఉత్తమ అయిదు గోల్స్ దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. కానీ అవి చూసినా అతని మాయ అర్థమవుతోంది. 1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్‌ను.. డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్‌పోస్టులోకి అతను పంపించిన తీరు అమోఘం. 1958 ప్రపంచకప్ ఫైనల్లో స్వీడన్‌పై పెనాల్టీ ప్రదేశంలో సహచర ఆటగాడి నుంచి బంతి అందుకున్న అతను.. ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించిన వైనం అసాధారణం. గోల్‌కీపర్ డైవ్ చేసినా ఆ బంతిని ఆపలేకపోయాడు. ఇలాంటి గోల్స్ మరెన్నో. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగా బ్రెజిల్ ఓ వెలుగు వెలిగిందంటే అందుకు ప్రధాన కారణం పీలే. 1958 ప్రపంచకప్‌లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రాణించి ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్‌లో గాయం కారణంగా ప్రభావం చూపలేకపోయాడు. 1966లో జట్టు నిరాశాజనక ప్రదర్శనతో అతను ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి సొంతం చేసుకున్నాడు. 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రపంచకప్‌ల్లో 14 మ్యాచ్‌ల్లో 12 గోల్స్ సాధించాడు.