లాక్‌డౌన్ సమయంలో ఇంటికి రంగులేయటంతో పాటు వంటనూ తానే చేశానని అంటోంది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. కరోనా నేపథ్యంలో రెండు నెలలుగా ఇంటి పట్టున ఉంటూ ఏమేం చేసిందో నిఖత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"ఇన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండటం నాలుగేళ్లలో ఇదే ప్రథమం. ఎప్పుడూ 3, 4 రోజులకు మించి ఇంట్లో ఉండను. దిల్లీలో ఏడాదంతా జాతీయ శిక్షణ శిబిరంలో బిజీగా ఉంటా. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే. ఇక్కడ శిక్షణకు అవకాశం లేదు. అయితే ఫిట్‌నెస్ సాధన కొనసాగుతోంది. కసరత్తుల వీడియోలు వాట్సాప్ గ్రూపులో పంపాలి. ఏమేం చేస్తున్నది కోచ్ పర్యవేక్షిస్తుంటాడు. భౌతిక దూరం పాటించాల్సి ఉండటం వల్ల ఇతరులతో కలిసి సాధన చేయట్లేదు. మిగతా సమయంలో వంట గదిలో అమ్మకు సహాయం చేస్తున్నా. లాక్‌డౌన్‌లో పూర్తిస్థాయి చెఫ్‌గా మారిపోయా" అని తెలిపింది.