తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2021, 9:44 AM IST

ETV Bharat / sports

బక్సమ్​ టోర్నీకి కరోనా సెగ- ఫైనల్స్​ నుంచి ముగ్గురు ఔట్​

బక్సమ్​ టోర్నీ ఫైనల్స్​కు ముందు.. భారత బాక్సర్​ ఆశీష్​ కుమార్​కు కరోనా సోకింది. దీంతో అతని సహచరులు హుసాముద్దీన్​, సుమిత్​ సంగ్వాన్​లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారు. పురుషుల విభాగంలో ఒకే ఒక స్వర్ణం భారత ఖాతాలో చేరింది.

Boxam International: Pooja Rani defeats World Champion as nine Indian Boxers storm into finals
బక్సమ్​ టోర్నీ: కరోనాతో ముగ్గురు బాక్సర్లు ఔట్​

స్పెయిన్ వేదికగా జరుగుతోన్న బక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నమెంట్​ ఫైనల్​ పోరుకు ముందు.. భారత్​కు ఊహించని షాక్​ తగిలింది. కరోనా కారణంగా టోర్నీ నుంచి ముగ్గురు బాక్సర్లు తప్పుకోవాల్సి వచ్చింది. 75 కేజీల విభాగంలో భారత్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆశీష్​ కుమార్​కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. దీంతో అతని రూమ్​మేట్​లు అయిన మహమ్మద్​ హుసాముద్దీన్​ (57 కేజీ), సుమిత్ సంగ్వాన్ (81 కేజీ) కూడా పోటీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఈ ముగ్గురికి రజత పతకాలు దక్కనున్నాయి.

ఫైనల్లో పోటీ పడితే వారికి స్వర్ణం గెలిచే అవకాశం ఉండేది. హుసాముద్దీన్​, సంగ్వాన్​లకు చేసిన కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​గా వచ్చినప్పటికీ.. స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టోర్నీ నుంచి తప్పుకోక తప్పలేదు.

మరోవైపు అనారోగ్యం కారణంగా మరో వెటరన్​ బాక్సర్ సతీశ్​ కుమార్ (91 పైన కేజీల విభాగం) కూడా ఫైనల్లో పాల్గొనలేదు. ఇతనికీ రజత పతకం దక్కనుంది. ​

'ఎంతో గొప్పగా ప్రారంభించిన బాక్సింగ్ పోటీలు.. చివరికిలా అర్ధాంతరంగా ముగిశాయి. ఆశీష్​కు ఎలాంటి వైరస్​ లక్షణాలు లేవు. అతడు బాగానే ఉన్నాడ'ని భారత బాక్సింగ్ హై పర్ఫామెన్స్​ డైరెక్టర్ శాంటిగో నీవా పేర్కొన్నారు.

ఒక్కరే 'బంగారం'..

పురుషుల విభాగంలో కేవలం మనీశ్​ కుమార్​ (63 కేజీ) మాత్రమే స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో డెన్మార్క్​ ప్రత్యర్థి నికోలై టెర్టెర్యాన్​పై మనీశ్​ గెలుపొందాడు. మోకాలి గాయం నయమైన తర్వాత ఆడిన తొలి టోర్నమెంట్​లోనే మనీశ్​ సత్తా చాటాడు. 69 కేజీల విభాగంలో వికాస్​ క్రిష్ణన్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పైగా ఈ పోటీలో అతనికి కంటికి గాయమైంది.

మహిళల విభాగం..

ఇక మహిళల బాక్సింగ్​ విభాగంలో ఏ ఒక్కరూ బంగారు పతకం సాధించలేకపోయారు. సిమ్రన్​జీత్​ కౌర్​ (60 కేజీ) ఫైనల్​ చేరినప్పటికీ.. పోటీ నుంచి తప్పుకుంది. ఆమె సెమీఫైనల్​ ప్రత్యర్థి కిరియా తపియాకు కరోనా సోకింది. సిమ్రన్​కు నెగెటివ్​ వచ్చినప్పటికీ.. ఆమెను పోటీల నుంచి బలవంతంగా తప్పించారు నిర్వాహకులు.

'స్థానిక ప్రభుత్వ కొవిడ్ మార్గదర్శకాల మేరకు.. సిమ్రన్​జీత్​ ఫైనల్లో పాల్గొనడం లేద'ని భారత బాక్సింగ్ ఉమెన్స్​ హై పర్ఫామెన్స్​ డైరెక్టర్​ రాఫెల్​ బెర్గామాస్కో తెలిపారు.

పూజా రాణి, జాస్మిన్​లు తుది పోటీలో ఓటమి పాలయ్యారు. దీంతో మొత్తం భారత ఖాతాలోకి ఒక స్వర్ణం, 8 రజతాలు, ఒక కాంస్య పతకాలు రానున్నాయి.

ఇదీ చదవండి:ఐదో టీ20లో ఆసీస్​ చిత్తు.. కివీస్​దే సిరీస్​

ABOUT THE AUTHOR

...view details