తెలంగాణ

telangana

ETV Bharat / sports

హరియాణా ఎన్నికల దంగల్​ పోటీలో క్రీడాకారులు - bjp given tickets to sports persanalities

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు క్రీడాకారులకు సీటు ఇచ్చింది భాజపా. రెజ్లర్లు బబితా కుమారి ఫొగాట్, యోగేశ్వర్ దత్​తోపాటు భారత హాకీ జట్టు మాజీ సారథి సందీప్ సింగ్​ కూడా పోటీచేయనున్నాడు.

హరియాణా ఎన్నికల దంగల్​లో క్రీడాకారులు ఢీ

By

Published : Sep 30, 2019, 8:26 PM IST

Updated : Oct 2, 2019, 3:46 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో రాజవర్థన్ సింగ్ రాఠోడ్​, కిరణ్ రిజిజు, గౌతమ్ గంభీర్ లాంటి క్రీడాకారులకు టిక్కెట్లిచ్చిన భారతీయ జనతా పార్టీ మరోసారి ఆటగాళ్లవైపే మొగ్గు చూపింది. అక్టోబరు 21న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముగ్గురు క్రీడాకారులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. నేడు ప్రకటించిన 78 మంది సభ్యుల జాబితాలో బబితా ఫొగాట్,యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్), సందీప్ సింగ్(హాకీ) లాంటి క్రీడాకారులకు చోటు కల్పించింది.

పొలిటికల్​ రింగులో పట్టు పట్టాలనుకుంటున్న బబితా

రెజ్లింగ్​లో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసే బబితా రాజకీయాల్లోనూ ఓ పట్టు పట్టాలని చూస్తోంది. ఆగస్టులో భాజపాలో చేరిన బబితా... ఎమ్మెల్యే టిక్కెట్​ దక్కించుకొని పొలిటికల్ రింగులో సత్తాచాటాలనుకుంటోంది. దాద్రి నియోజకవర్గం నుంచి పోటీచేయనుంది. 55 కేజీల విభాగంలో 2014, 2018 కామన్​వెల్త్ క్రీడల్లో పసిడి కైవసం చేసుకుంది బబితా. 51 కేజీల విభాగంలో 2012 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్యం, 2010 కామన్​వెల్త్​ గేమ్స్​లో రజతం కైవసం చేసుకుంది.

రాజకీయ కుస్తీలో ఢీకొట్టనున్న యోగేశ్వర్ దత్​.

సెప్టెంబరు 26న భాజపా తీర్థం పుచ్చుకున్న యోగేశ్వర్ దత్ చేరిన నాలుగు రోజుల్లో శాసనసభ టిక్కెట్ పొందడం విశేషం. 2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యాన్ని చేజిక్కించుకున్న ఈ రెజ్లర్ బరోడా నుంచి హరియాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. 2010, 2014 కామన్​వెల్త్ క్రీడల్లో స్వర్ణాలతో సత్తాచాటాడు. ఇవే కాకుండా ఆసియా ఛాంపియన్​షిప్​లోనూ పసిడిపతకాలతో తన పట్టు చూపించాడు.

యోగేశ్వర్ దత్ - సందీప్ సింగ్

శాసనసభ ఎన్నికలకు సై అంటున్న సర్దార్..

భారత హాకీ జట్టు మాజీ సారథి సందీప్ సింగ్ ఇటీవలే భాజపాలో చేరాడు. పెహోవా నుంచి శాసనసభకు పోటీచేయనున్నాడు. 2010 కామన్​వెల్త్ క్రీడల్లో భారత్ రజతం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

2006లో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డ భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ ఏడాది పాటు వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. అనంతరం కోలుకుని 2010 ప్రపంచకప్​లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం.. హరియాణా పోలీస్‌శాఖలో డీఎస్​పీ ర్యాంకుతో ఉన్న సింగ్‌ జీవితకథను 'సూర్మా' పేరుతో బాలీవుడ్ సినిమాగా రూపొందించారు.

ఇదీ చదవండి: సుమోలతో తలపడ్డ స్టార్ టెన్నిస్ ప్లేయర్

Last Updated : Oct 2, 2019, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details