తెలంగాణ

telangana

By

Published : Jun 29, 2022, 8:34 AM IST

ETV Bharat / sports

'నా కుమారుడిని అతనే చంపేశాడు'.. సీనియర్​ హాకీ ఆటగాడిపై హత్యారోపణలు

Birendra lakra hockey player: భారత హాకీ సీనియర్‌ ఆటగాడు బిరేందర్‌ లక్రా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లక్రానే తన కుమారుడిని హత్య చేశాడని ఆనంద్​ టోపో తండ్రి ఆరోపించారు. ఆనంద్‌ మెడపై చేతి గుర్తులు కనిపించాయని.. పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం ఆత్మహత్య అని రాశారని పేర్కొన్నారు.

లక్రాపై హత్యారోపణలు
లక్రాపై హత్యారోపణలు

Birendra lakra hockey player: చిన్ననాటి స్నేహితుడు ఆనంద్‌ టోపో హత్యలో భారత హాకీ సీనియర్‌ ఆటగాడు బిరేందర్‌ లక్రా ప్రమేయం ఉందంటూ మృతుడి తండ్రి బంధన్‌ ఆరోపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భువనేశ్వర్‌లో ఆనంద్‌ మరణించాడు. ఈ హత్యలో లక్రా ప్రమేయం ఉందని.. గతంలో డీఎస్పీగా పనిచేసిన హాకీ ఆటగాడిని పోలీసులు రక్షిస్తున్నారని బంధన్‌ మంగళవారం ఆరోపించాడు. గత 4 నెలలుగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా రాష్ట్ర పోలీసులు సహకరించనందుకే బహిరంగంగా మాట్లాడుతున్నానని తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో 32 ఏళ్ల లక్రా సభ్యుడు. ఆసియా కప్‌లో భారత్‌కు సారథ్యం కూడా వహించాడు.

"బిరేందర్‌.. ఆనంద్‌ చిన్ననాటి స్నేహితుడు. ఆనంద్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని ఫిబ్రవరి 28న బిరేంద్ర ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత ఆనంద్‌ చనిపోయాడని చెప్పాడు. ఏం జరిగిందని అడిగితే భువనేశ్వర్‌ రమ్మన్నాడు. తర్వాత రోజు అక్కడికి చేరుకోగా.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆనంద్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీస్‌ అధికారి తెలిపాడు. కాని ఆనంద్‌ ఎలాంటి సూసైడ్‌ నోట్‌ రాయలేదు. చాలా ఒత్తిడి తర్వాత మృతదేహాన్ని చూపించారు. ఆనంద్‌ మెడపై చేతి గుర్తులు కనిపించాయి. పోస్ట్‌మార్టం నివేదిక మాత్రం ఆత్మహత్య అని చెప్పింది" అని బంధన్‌ వివరించాడు. లక్రాకు చెందిన ఫ్లాట్‌లో రాత్రి 10 గంటలకు ఆనంద్‌ మరణించాడు. ఆ సమయంలో ఫ్లాట్‌లో లక్రాతో పాటు మంజీత్‌ టెటె అనే అమ్మాయి ఉన్నట్లు సమాచారం. "నా కుమారుడి అనుమానాస్పద మృతిపై స్వతంత్ర విచారణ చేపట్టాలి. ఫిబ్రవరి 16న ఆనంద్‌ పెళ్లి చేసుకున్నాడు.. 28న చనిపోయాడు. వైవాహిక జీవితంలో ఆనంద్‌ సంతోషంగా ఉన్నాడు" అని బంధన్‌ వివరించాడు.

ఇదీ చూడండి :టీవీలో వచ్చిన 8 నిమిషాల వీడియోతో.. ఆ ఫ్యామిలీలో 8 ఏళ్ల చీకట్లు మాయం!

ABOUT THE AUTHOR

...view details