తమిళనాడులోని ఓ పేదింటి కుటుంబంలో పుట్టింది రేవతి. దీనికి తోడు పులి మీద పుట్రలా తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు కూడా దూరమయ్యారు. రేవతితో పాటు ఆమె సోదరికి అమ్మమ్మ ఆర్మల్ సర్వస్వమైంది. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే.. ఇటుకలు మోసే పనికి వెళ్లేది. దీంతో పిన్న వయసులోనే పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడ్డారు రేవతి, ఆమె సోదరి. ఈ క్రమంలో చేసేదేమీ లేక తన ఇద్దరు మనవరాళ్లను ఓ ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించింది ఆర్మల్. అలా రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్‌లోనే ఉండి చదువుకుంది రేవతి.
షూస్లేకుండానే పోటీలకు!
చదువుకుంటున్నప్పుడే పరుగుపై ఆసక్తి పెంచుకుంది రేవతి. ముఖ్యంగా ప్లస్‌టూ అభ్యసిస్తున్న సమయంలో రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగు పోటీల్లో షూస్లేకుండానే పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాళ్లు బొబ్బలెక్కినప్పటికీ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇది చూసిన కన్నన్ అనే ఓ అథ్లెటిక్ కోచ్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆర్థికంగా ఆదుకోవడం సహా తన సొంత ఇంట్లోనే వసతి కల్పించాడు. అలా కొద్ది రోజుల పాటు కన్నన్ శిక్షణలో రాటుదేలిన రేవతి ఆయన సహాయంతోనే మదురైలోని ప్రముఖ లేడీ డాక్ కాలేజీలో ఉచిత సీటు సంపాదించుకుంది. అక్కడి ప్రొఫెషన్ కోచ్‌ల సహాయంతో తన నైపుణ్యాలకు మరిన్ని మెరుగులద్దుకుంది.
వారి ప్రోత్సాహంతోనే!
ఇలా అమ్మమ్మ, కోచ్‌ల ప్రోత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది రేవతి. మొదట 2016 జూనియర్ నేషనల్స్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్న ఆమె.. సీనియర్ నేషనల్స్ విభాగంలోనూ రజత పతకం గెల్చుకుంది. ఆ తర్వాత 2019 ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి నాలుగో స్థానంలో నిలిచింది. అదే ఏడాది తన కోచ్‌ల సూచనలతో 100 మీటర్ల నుంచి 400 మీటర్ల విభాగానికి మారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లోనూ మెరుగైన ప్రతిభ చూపింది.