చరిత్రలో లేదా సినిమాల్లో కత్తి యుద్ధం గురించి చదవడం.. చూడటమే కానీ దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడను చూస్తూనే ఉంటాం. రెండు ఊచల్లాంటి కత్తులు పట్టుకుని ఫెన్సర్లు పోరాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది.. శరీరానికి కత్తి తాకితే వారి శిరస్త్రాణం పైనున్న లైటు వెలగడం లాంటివి చాలా కొత్తగా అనిపిస్తాయి. ఐరోపా దేశాలు ఈ క్రీడలో ఆరితేరిపోయాయి. అలాంటిది మన దగ్గరా అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఫెన్సర్ ఉందని.. ఆమెను టోక్యోలో ఒలింపిక్స్ చూస్తామని ఎవరైనా ఊహించి ఉంటారా? ఒలింపిక్స్‌లో కత్తి తిప్పబోతున్న ఆ ఫెన్సరే భవానీ దేవి. మహిళల వ్యక్తిగత సెబర్ విభాగంలో విశ్వ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా నిలిచిన ఈ 27 ఏళ్ల తమిళనాడు అమ్మాయి.. ఈ అవకాశాన్ని అందుకోవడానికి ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసింది.
తొలి భారత ఫెన్సర్‌గా భవాని
చెన్నెలో పుట్టిన భవాని 2003లో కెరీర్ ప్రారంభించింది. ధనుష్‌కొడి పాఠశాలలో చదువుతున్న సమయంలోనే ఆమెకు ఫెన్సింగ్ పరిచయం అయింది. ఈ క్రమంలో కేరళ సాయ్ సెంటర్‌లో చోటు దక్కడం ఆమె కెరీర్‌లో మలుపు. 14 ఏళ్లకే తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడిన భవాని.. 2009 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ (మలేసియా), 2010లో ఆసియా ఛాంపియన్‌షిప్ (ఫిలిప్ఫిన్స్)లో కాంస్యం గెలవడం ద్వారా వెలుగులోకి వచ్చింది. 2015లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని గోస్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్ దొరకడం ఆమె కెరీర్‌కు ఊతమిచ్చింది. 2019లో కాన్‌బెర్రాలో జరిగిన సీనియర్ కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి సీనియర్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా భవాని నిలిచింది. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే సత్తా తనకుందని చాటింది. అదే ఏడాది నాన్న మరణించడం ఆమెను మానసికంగా కుంగదీసినా.. ఒలింపిక్స్‌లో ఆడాలన్న ఆయన కల తీర్చడం కోసం ఈ క్రీడలో కొనసాగింది.