భారత మహిళా క్రికెట్ టీమ్ ప్లేయర్ రాజేశ్వరి గైక్వాడ్ ఓ సూపర్ మార్కెట్లో హంగామా చేసిందని వచ్చిన ఆరోపణలపై విజయపుర ఎస్పీ హెచ్‌డీ ఆనందకుమార్ స్పందించారు. 'ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆమె జాతీయ క్రీడాకారిణి.. కాబట్టి అది వార్తగా మారింది. దీనిపై ఫిర్యాదు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము' అని తెలిపారు.
ఇదీ జరిగింది.. విజయపురలోని ఓ షాపింగ్ మాల్‌లో భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్, ఆమె స్నేహితులు తనతో గొడవ పడ్డారని సూపర్ మార్కెట్ యజమాని మల్లికార్జున్ ఆరోపించారు. గొడవ పడే క్రమంలో తనను గాయపరిచారని చెప్పాడు. స్టేషనరీ వస్తువులు కొనేందుకు వెళ్లిన ఆమె దుకాణదారుడితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీనిపై రాజేశ్వరీ గైక్వాడ్ స్పందించింది. తాను తన స్నేహితురాలితో సూపర్ మార్కెట్ వెళ్లింది నిజమేనని.. కానీ అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని చెప్పింది.