Beijing Olympics Artificial Snow: శీతాకాల ఒలింపిక్స్ సందడి మొదలైంది. అథ్లెట్లు మంచుపై దూసుకెళ్తూ వివిధ విభాగాల్లో పోటీపడుతున్నారు. కానీ అది నిజమైన హిమం కాదు.. అంటే ఆకాశం నుంచి కురిసిన మంచు కాదు. దాన్ని కృత్రిమంగా తయారు చేశారు. అవును.. ఇది నిజం. ప్రత్యేకంగా శీతాకాల ఒలింపిక్స్ కోసం చైనా భారీ స్థాయిలో కృత్రిమంగా మంచు తయారు చేసింది. ఈ ఒలింపిక్స్ చరిత్రలోనే దాదాపు మొత్తం కృత్రిమ మంచు మీద జరుగుతున్న తొలి క్రీడలు ఇవే. అత్యాధునిక యూరోపియన్ యంత్రాలను వాడి కొన్ని నెలల పాటు కష్టపడి ఈ మంచును ఏర్పాటు చేశారు.
ఎలా చేశారు?: వాతావరణంలోని నీటి ఆవిరి ఘనీభవించడంతోనే హిమపాతం ఏర్పడుతుంది. చల్లని గాలి తాకగానే ఘనీభవించే నీరు మంచు స్పటికాలుగా మారుతుంది. ఆ స్పటికాలన్నీ ఒక్క దగ్గర చేరి గురుత్వాకర్షణ కారణంగా నేలపై పడతాయి. దాన్నే మంచు అంటారు. కానీ చైనాలో అతి తక్కువ మంచు పడుతుంది. దీంతో ఈ ఒలింపిక్స్ కోసం కృత్రిమ మంచు కురిపించాల్సి వచ్చింది. అందుకోసం పరమాణువులతో కూడిన నీటిని, యాంత్రికంగా తయారు చేసిన న్యూక్లియేటర్స్ (చిన్న మంచు స్పటికాలు)ను భారీ పంపుల ద్వారా గాలిలోకి పంపించారు. అవి కలిసి మంచుగా ఏర్పడి భూమిని తాకింది. ఈ విధానం కొన్ని దశాబ్దాల ముందు నుంచే ఉంది. 1980 న్యూయార్క్ ఒలింపిక్స్‌లో ఇలా తయారు చేసిన మంచును తొలిసారి వాడారు. ఇప్పుడు బీజింగ్ క్రీడల్లో కృత్రిమ మంచు తయారీ కోసం అవసరమైన యంత్రాలను అందించేందుకు టెక్నోఆల్పిన్ సంస్థ సుమారు రూ.164 కోట్లతో ఒప్పందం చేసుకుంది. స్కీయింగ్, స్నోబోర్డింగ్ పోటీల వేదికల్లో సాంకేతిక మంచు కోసం 272 ఫ్యాన్ గన్స్, 82 స్టిక్ ల్యాన్సెన్‌ను ఉపయోగించింది.