Ballon D'Or Award Messi :గతేడాది తన వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్న అర్జెంటీనా స్టార్, దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అతడు బాలన్ డి ఓర్ అవార్డును ముద్దాడాడు. 2022-23 గానూ ఉత్తమ ప్రదర్శన చేయడం, ఖతర్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో తన జట్టును గెలిపించిన తీరుకు.. మెస్సీకి ఈ అవార్డును అందజేశారు. సోమవారం(అక్టోబర్ 30) రాత్రి పారిస్‌లోని థియేటర్ డు షాటలెట్లో జరిగిన సెర్మనీలో మెస్సీ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. దీంతో మెస్సీ.. అత్యధికంగా 8 సార్లు ఈ అవార్డును అందుకున్న ఆటగాడిగానూ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ చేతుల మీదుగా దీనిని తీసుకున్నాడు.
ఫ్రెంచ్ స్టార్ ప్లేయర్ ఎంబాపై, మాంచెస్టర్ సిటీ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్లను వెనక్కి నెట్టి మెస్సీ ఈ బాలన్ డి ఓర్ అవార్డును ఖాతాలో వేసుకున్నాడు మెస్సీ. ఈ పురస్కారం అర్జెంటీనా టీమ్ మొత్తానికి.. తన బహుమానం అని చెప్పుకొచ్చాడు. సోమవారం అర్జెంటీనా దివంగత స్టార్ ప్లేయర్ మారడోనా 63వ జయంతి. ఈ సందర్భంగా మారడోనాకు మెస్సీ ఈ అవార్డును అంకితమిచ్చాడు.
కాగా, ఈ మధ్యే బాలన్ డి ఓర్ అవార్డు నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో మెస్సీకి కలిసి వచ్చింది. పూర్తి కేలండర్ ఇయర్ కాకుండా గత సీజన్లో ప్లేయర్ల్ రికార్డులు, ప్రదర్శన చూసి పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించారు. అలా మెస్సీకి ఈ అవార్డు వరించింది. తొలి సారి 2009లో అతడు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు.