భారత్‌కు పసిడి ఆశలు కల్పించిన స్టార్ రెజ్లర్ భజరంగ్ సెమీస్‌లో ఓడిపోయాడు. ఈ పరాభవంలో రిఫరీ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గురువారం జరిగిన పోరులో 65 కిలోల విభాగంలో భజరంగ్ పాల్గొన్నాడు. వివాదాస్పదంగా సాగిన మ్యాచ్‌లో స్కోర్లు టై అవగా.. ప్రత్యర్థి వైపే రిఫరీ మొగ్గుచూపాడు. ఉద్దేశపూర్వకంగానే పునియాను ఓడించినట్లు తెలుస్తోంది.
స్కోర్లు సమం... ప్రత్యర్థి విజేత
హోరాహోరీగా సాగిన సెమీస్‌లో దౌలత్ నియజ్‌బెకోవ్(కజకిస్థాన్)తో పోటీపడ్డాడు భజరంగ్. చివరి ఆరు నిమిషాలు ఉత్కంఠగా గడిచాయి. ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోరాడారు. ఆట ముగిసేటప్పటికి స్కోర్లు 9-9తో సమం అయ్యాయి. ఈ పోరాటంలో నియజ్‌బెకోవ్ ఒకే దఫాలో 4 పాయింట్లు సాధించాడనే కారణంతో రిఫరీ అతడినే విజేతగా ప్రకటించాడు.
సవాల్ పట్టించుకోలేదు...
నియజ్‌బెకోవ్‌తో జరిగిన బౌట్‌లో భజరంగ్ తన ఉడుంపట్టుతో అతడిని బంధించాడు. అలసిపోయిన ప్రత్యర్థికి ఊపిరి తీసుకొనేందుకు రిఫరీ ఎక్కువ సమయం ఇచ్చాడు. మూడుసార్లు కాషన్ కూడా ఇవ్వలేదు. ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల నియజ్‌బెకోవ్ పుంజుకొని వృత్తం వద్దకు భజరంగ్‌ను నెట్టేశాడు. ఫలితంగా రిఫరీ ఏకపక్షంగా ప్రత్యర్థికి నాలుగు పాయింట్లు ఇచ్చాడు. మ్యాచ్‌లో చాలాసార్లు రిఫరీ నిర్ణయాలను భజరంగ్ సవాల్ చేసినా.. వాటిని పట్టించుకోలేదు. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన భజరంగ్ కోచ్ షేక్ బెనిటిడిస్.. కోచ్‌ల బ్లాక్‌ను కాలితో తన్ని వెళ్లిపోయాడు.
" భజరంగ్ చేసిన సవాళ్లను రిఫరీ పట్టించుకోలేదు. ప్రత్యర్థిని బంధించినందుకు అతడికి కనీసం రెండు పాయింట్లయినా ఇవ్వాలి".
--బెనిటిడిస్, భజరంగ్ కోచ్
మరో సెమీస్ పోరులో రవి దహియా (57 కిలోలు) 4-6 తేడాతో ప్రపంచ ఛాంపియన్ జౌర్ ఉగుయేవ్ చేతితో ఓడాడు. అంతకుముందు ఈ ఇద్దరు భారత క్రీడాకారులు సెమీస్‌లో అడుగుపెట్టి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.