సామాజిక మాధ్యమాలను తిరిగి వాడుతున్నట్లు ప్రకటించాడు భారత ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పూనియా.
ఒలింపిక్స్‌కు ముందు ఆటపై దృష్టి సారించడానికి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు గత నెలలో వెల్లడించాడు పూనియా. అయితే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎంతో కొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు పూనియా తెలిపాడు. అందుకు సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకోవాలని భావించినట్లు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:ఒలింపిక్స్ కోసం సోషల్ మీడియాకు దూరమైన రెజ్లర్
"టోక్యో ఒలింపిక్స్‌పై దృష్టి సారించడానికి సోషల్ మీడియాను కొంతకాలం పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాను. కానీ, కరోనా వల్ల ఇప్పుడు దేశంలో పరిస్థితి సంక్షోభ స్థితిలో ఉంది. దీంతో మళ్లీ వాటిని వాడలనుకుంటున్నాను. నా జీవితంలో ఏది సాధించినా.. అది మీ దీవెనలతోనే జరిగింది. కాబట్టి ఒక ఆటగాడిగా మీ ముందుకు వస్తున్నాను. ఈ కఠిన సమయంలో నా శక్తి మేర సాయం చేస్తాను. లేకపోతే నేను జీవితంలో సాధించినదానికి అర్థం ఉండదు."
-భజరంగ్ పూనియా, భారత రెజ్లర్.
గతంలో సామాజిక మాధ్యమాల వల్ల తన శిక్షణ అదుపు తప్పుతోందని పూనియా తెలిపాడు. అందుకే వాటిని కొంతకాలం పక్కన పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్ ముగిసినట్లు భావిస్తాం'