Australian Open: డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ లేని టోర్నీలో టైటిల్‌పై కన్నేసిన ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) మరో అడుగు ముందుకేశాడు. శనివారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఈ రెండో సీడ్ ఆటగాడు 6-4, 6-4, 6-2 తేడాతో జాండ్‌షూప్ (నెదర్లాండ్స్)పై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అతను గంట 55 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు. తొలి సెట్ మూడో గేమ్‌లో జాండ్‌షూప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను ఆధిక్యం సాధించాడు. ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా పెత్తనం చెలాయించిన మెద్వెదెవ్ తొలి సెట్ ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్లో అతను మరింతగా చెలరేగాడు. ప్రత్యర్థికి పాయింట్లు కోల్పోకుండా వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 3-1తో ఆధిక్యం సాధించాడు. ఆ దశలో ప్రత్యర్థి పుంజుకోవాలని ప్రయత్నించినా ఆ అవకాశం ఇవ్వని అతను ఆ సెట్ సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్లో అతను ఏస్‌లు, విన్నర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి ఆ సెట్‌తో పాటు మ్యాచ్ దక్కించుకున్నాడు.
సిట్సిపాస్ కష్టంగా
నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-3, 7-5, 6-7 (2-7), 6-4 తేడాతో పెయిర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. తొలి సెట్‌ను సులభంగానే గెలుచుకున్న అతనికి.. రెండు, మూడో సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్‌ను అతి కష్టం మీద నెగ్గిన అతనికి మూడో సెట్లో మాత్రం ఓటమి తప్పలేదు. కానీ ఆ దశలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాటం సాగించిన సిట్సిపాస్ నాలుగో సెట్‌లో మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఐజో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 5-7, 6-7 (3-7), 6-3, 3-6తో 27వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడాడు. అనుభవజ్ఞుడైన సిలిచ్‌పై గెలిచేందుకు రుబ్లెవ్ పోరాటం సరిపోలేదు. 20వ సీడ్ ఫ్రిట్జ్ (అమెరికా) 6-0, 3-6, 3-6, 6-4, 6-3తో 15వ సీడ్ అగట్ (స్పెయిన్)పై నెగ్గాడు. అగర్, సిన్నర్, డిమినార్ కూడా ముందంజ వేశారు.
సబలెంక జోరు