ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు వేళైంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ మొదలయ్యేది సోమవారమే. అందరి దృష్టి ఈ టోర్నీలో పునరాగమనం చేస్తున్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌పైనే! గత సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగాల్సిన జకోని కరోనా టీకా వేసుకోని కారణంగా అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. అంతేకాదు వీసాను కూడా రద్దు చేశారు. కానీ కరోనా ఆంక్షలు తొలగి వీసాను పునరుద్దరించడంతో అతడికి ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఈ తొమ్మిదిసార్లు ఛాంపియన్ ఈసారి ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం.
సింగిల్స్ తొలి రౌండ్లో కార్‌బాలెస్ (స్పెయిన్)తో పోరుతో టైటిల్ వేట్‌ను ఆరంభించనున్న నొవాక్.. నాలుగో సీడ్‌గా బరిలో దిగుతున్నాడు. మరోవైపు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా పోటీలో ఉన్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (22) ఖాతాలో ఉన్న రఫా, సంఖ్యను మరింత పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. జకోవిచ్, నాదల్ భిన్న పార్శ్వాల్లో ఉండడంతో ఫైనల్ వరకు ఎదురుపడరు. తొలి రౌండ్లో జాక్ డ్రాపర్ (బ్రిటన్)తో టాప్‌సీడ్ నాదల్ తలపడనున్నాడు. ప్రపంచ నం.1 కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరమైనా.. మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), అయిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) నుంచి జకో, రఫాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.