Australian Open 2022 winner Nadal: కేవలం పదిహేనేళ్లకే ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి ప్రవేశించిన ఓ కుర్రాడు.. మరో నాలుగు సంవత్సరాలకు తొలి టైటిల్ నెగ్గడం.. ఇవాళ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల విజేతగా ఆవిర్భవిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. 'క్లే కోర్టు' రారాజుగా వెలుగొందుతున్న వీరుడు.. ఇంతకీ ఆ ఘనతలను సాధించిందెవరో తెలుసా.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.
1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించిన రఫెల్ నాదల్.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించాడు. మరో నాలుగు సంవత్సరాలకే తొలి టైటిల్ (2005-ఫ్రెంచ్ ఓపెన్)ను తన ఖాతాలో వేసుకుని ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపు చూసేట్లు చేశాడు. అప్పటికే దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ క్లే కోర్టులు మినహా మిగతా అన్ని మైదానాల్లో మాంచి ఊపులో ఉన్నాడు. దీంతో రఫెల్ మట్టి కోర్టుల్లో చెలరేగిపోయాడు. ఒక వైపు రోజర్ ఉండగానే.. మరోవైపు జకోవిచ్ దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్, వింబుల్డన్ ఏదైనా సరే వీరి ముగ్గురిలో ఒకరికి దక్కడం ఖాయంగా ఉండేది.
త్రిముఖ పోరులో నాదల్ 2008లో నంబర్‌వన్ ర్యాంకుకు చేరాడు. దాదాపు 209 వారాలపాటు టాప్‌లో కొనసాగాడు. ఆ తర్వాత జకోవిచ్ (2011) ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత నాదల్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు. చివరిసారిగా 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు.
21 ఏళ్లు.. 21 గ్రాండ్‌స్లామ్‌లు
నాదల్ కెరీర్ ప్రారంభించి దాదాపు 21 ఏళ్లు కావడం.. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య కూడా 21కి చేరడం విశేషం. వ్యక్తిగత విభాగంలో టెన్నిస్ ఆడటం ఎప్పుడూ సవాలే. ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం, గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి గాయమైతే కోలుకునేందుకు నెలలపాటు సమయం పడుతుంది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డెన్ టైటిళ్లను గెలుచుకున్న నాదల్.. అత్యధికంగా ఫ్రెంచ్ ఓపెన్‌ను 13 సార్లు సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక యూఎస్ ఓపెన్‌ను నాలుగు సార్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఏడాదిలో (2010) ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా మూడు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. నాదల్ తర్వాత జకోవిచ్ (20), ఫెదరర్ (20) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈసారి ఎంతో ప్రత్యేకం..
ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ ముందు వరకు రోజర్ ఫెదరర్, జకోవిచ్‌తో పాటు నాదల్ 20 గ్రాండ్‌స్లామ్‌లతో సమంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకోలేకపోవడం, వయసుమీరడం వంటి కారణాలతో ఫెదరర్ పాల్గొనలేదు. ఇక జకోవిచ్ సంగతి తెలిసిందే.. వ్యాక్సినేషన్ వ్యవహారంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోయాడు. ఇక సీనియర్ రఫెల్ నాదల్ మాత్రమే. అయితే యువ క్రీడాకారులు సిట్సిపాస్, మెద్వెదెవ్ వంటి వారితో ఇరకాటం తప్పలేదు. మరోవైపు గత గాయాలు నాదల్ వెంబడిస్తున్నా పట్టుదలతో బరిలోకి దిగాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ వరకు పెద్దగా ఇబ్బంది పడని నాదల్.. అక్కడ మాత్రం సిట్సిపాస్‌తో పోరాడి విజయం సాధించాడు. ఫైనల్‌లోనూ తొలి రెండు సెట్లు ఓడిపోయిన నాదల్.. తిరిగి గొప్పగా పుంజుకున్నాడు. అసాధారణ రీతిలో పోరాటపటిమ చూపి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు.