Athelts periods tips: కొందరికి నెలసరి సమయంలో అడుగు తీసి అడుగు వేయడానికి శరీరం సహకరించదు. దీనికి తోడు శారీరక నొప్పులు వేధిస్తుంటాయి. ఇవన్నీ తట్టుకొని కెరీర్ని కొనసాగించడం మహిళలకు సవాలే! మరి, ఇలా పిరియడ్స్ సమయంలో మనకైతే షెడ్యూల్ను వాయిదా వేసుకునే వెసులుబాటు ఉండచ్చు.. అదే అంతర్జాతీయ క్రీడాకారిణుల పరిస్థితేంటి? సరిగ్గా కీలక మ్యాచులున్న సమయంలోనే నెలసరి వస్తే.. ఆ నొప్పిని భరిస్తూనైనా మ్యాచ్ను కొనసాగించాల్సిందే! ఒకవేళ ఓడిపోతే..? 'నేను అబ్బాయినైనా బాగుండు.. ఇలాంటి అవాంతరాల్లేకుండా కెరీర్ని కొనసాగించేదాన్ని!' అనుకోవడం సహజం. చైనా టెన్నిస్ ప్లేయర్ క్విన్వెన్ ఝెంగ్ కూడా అచ్చం ఇలాగే అనుకుంది. నెలసరి నొప్పితో తాజా మ్యాచ్ చేజార్చుకున్న ఆమె.. తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత తేరుకొని తాను నెలసరిలో ఉన్నానంటూ ధైర్యంగా బయటపెట్టింది. మొత్తానికి మ్యాచ్ ఓడినా.. తన నిజాయతీతో, ధైర్యంతో ఎంతోమంది మనసులు గెలుచుకుందామె.
'నేను నెలసరిలో ఉన్నాను!' ఈ విషయం ఇంట్లో అమ్మకు, పెళ్లైన మహిళలైతే భర్తకు.. ఇలా దగ్గరి వారికి మాత్రమే నిర్మొహమాటంగా చెప్పగలుగుతారు. ఇక మూడో వ్యక్తికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్తపడతారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం తమ పిరియడ్ గురించి, ఈ సమయంలో తలెత్తే అసౌకర్యం గురించి నిర్మొహమాటంగా అందరితో పంచుకుంటుంటారు. చైనా టెన్నిస్ ప్లేయర్ క్విన్వెన్ ఝెంగ్ కూడా అలాంటి అమ్మాయే!
నేను అబ్బాయినైనా బాగుండు..ఫ్రెంచ్ ఓపెన్లో భాగంగా క్విన్వెన్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్తో తలపడుతోంది. తన అద్భుతమైన ఆటతీరుతో తొలి సెట్లో పైచేయి సాధించిన క్విన్వెన్.. తర్వాత సెట్లను ప్రత్యర్థికి సమర్పించుకుంది. దాంతో మ్యాచ్ ఓడిపోయింది. అప్పటిదాకా అద్భుత ఆటతీరు ప్రదర్శించిన ఆమె.. మ్యాచ్ చేజార్చుకోవడమేంటి? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తన ఓటమికి అసలు కారణం.. నెలసరి నొప్పే అని వెల్లడించిందీ చైనీస్ ప్లేయర్.
"ఈరోజే నాకు నెలసరి మొదలైంది. ప్రతినెలా పిరియడ్స్ తొలి రోజున విపరీతమైన కడుపునొప్పి వేధిస్తుంటుంది. అయినా మ్యాచ్ను కొనసాగించాల్సిందే! శరీర ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లడం ఎవరి తరమూ కాదు. నేను అబ్బాయిగా పుట్టినా నాకీ బాధ తప్పేది. నా కాలి గాయం కంటే కడుపునొప్పి తీవ్రతే ఎక్కువగా ఉంది. ఏదేమైనా కోర్టులో నా శక్తి మేర కష్టపడ్డా. ఫలితం మరోలా రాసిపెట్టి ఉంది.." అంటూ భావోద్వేగానికి గురైంది క్విన్వెన్. ఇలా ప్రతికూలతల్ని అధిగమించి చక్కటి ఆటతీరును కనబర్చినందుకు గాను ఈ చైనా క్రీడాకారిణిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఆమే తెర తీసింది..క్విన్వెన్ మాత్రమే కాదు.. ఇటీవలే జరిగిన Palos Verdes Championshipలో భాగంగా న్యూజిలాండ్ గోల్ఫర్ లైడియా కో కూడా పిరియడ్స్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది. ఆ సమయంలో నెలసరిలో ఉన్న ఆమె.. ఆఖరి రౌండ్ కోసం ఫిజియోథెరపీ తీసుకుంది. "నాకిది నెలసరి సమయం. ఈ సమయంలో తీవ్రమైన నడుంనొప్పితో బాధపడుతుంటా. నడుమంతా పట్టేసినట్లుగా అనిపిస్తుంటుంది. అందుకే ఫిజియోథెరపీ సహాయం తీసుకున్నా. ఆ తర్వాత కాస్త ఉపశమనం కలిగింది.." అంటూ చెప్పుకొచ్చింది కో. అయితే ఈ అసౌకర్యంతోనే రెండు స్ట్రోక్స్ తేడాతో మ్యాచ్ను చేజార్చుకుందామె.
ఇలా వీళ్లిద్దరే కాదు.. క్రీడారంగంలో నెలసరి గురించి తొలిసారి నిర్భయంగా, నిర్మొహమాటంగా పెదవి విప్పిన ఘనత చైనా స్విమ్మర్ ఫు యువాన్హుయీకే దక్కుతుంది. 2016లో రియో ఒలింపిక్స్లో టీమ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇదంతా తన నెలసరి వల్లే అని, ఈ సమయంలో విపరీతమైన నీరసం, అలసట వల్లే వెనకబడిపోయానంటూ చెప్పుకొచ్చింది. అలా నెలసరి గురించి ధైర్యంగా మాట్లాడిన ఫును అప్పట్లో ప్రపంచమంతా కొనియాడింది.
అసలెలా మేనేజ్ చేస్తారు?.. అయితే తాజా క్విన్వెన్ సంఘటనతో 'అసలు క్రీడాకారిణులు నెలసరి నొప్పుల్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు?' అనే ప్రశ్న మరోసారి తెరమీదకొచ్చిందని చెప్పచ్చు. సాధారణంగానే ఈ సమయంలో ఏ పనీ చేయలేం. అలాంటిది ఎప్పుడూ వర్కవుట్లు, సాధన చేస్తూ ఉండే క్రీడాకారిణులు ఈ నెలసరి సమస్యల్ని ఎలా అధిగమిస్తారు? ఆయా క్రీడల్లో ఎలా రాణిస్తారు? అంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే వాళ్లకున్న కొన్ని ప్రత్యామ్నాయాలు, వాళ్లు తీసుకునే జాగ్రత్తలు ఈ సమయంలో కలిగే అసౌకర్యాన్ని, అలాగే PMS (ముందస్తు నెలసరి లక్షణాలు)ను మేనేజ్ చేసుకునే శక్తిని వాళ్లకు అందిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!