భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ హిమదాస్.. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న రేసులో నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం ఆమె పేరును సిఫార్సు చేసినట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఖేల్‌రత్నకు హిమదాస్ నామినేట్
భారత స్ప్రింటర్ హిమదాస్‌ను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు నామినేట్ చేసింది అసోం రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలతో మెరిసిందీ క్రీడాకారిణి.
2018లో జరిగిన అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ మహిళల 400మీ. పరుగులో స్వర్ణం గెలిచిన హిమ.. అంతర్జాతీయ స్థాయిలో పసిడి గెలిచిన తొలి ట్రాక్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల 4×400 మిక్స్‌డ్, మహిళల 4×400మీ. రిలేల్లో ఆమె బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 400మీ. వ్యక్తిగత పరుగులో రజతం నెగ్గింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని పతకాలు కైవసం చేసుకుంది.
2018లోనే అర్జున అవార్డు అందుకున్న హిమదాస్ ఈసారి ఖేల్‌రత్న పురస్కారం కోసం జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టీటీ క్రీడాకారిణి మనిక బత్రా, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పోటీపడనుంది.