ఖతార్‌లోని దోహ వేదికగా మంగళవారం ప్రారంభమైన 14వ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు భారత షూటర్ దీపక్ కుమార్. ఇందులో పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పాల్గొన్న దీపక్... ఫైనల్ ఈవెంట్‌లో 227.8 స్కోరుతో పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పదో భారత షూటర్‌గా నిలిచాడు. తన పుట్టినరోజున దీపక్ ఈ అర్హత పొందడం విశేషం.
2018లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లోనూ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు దీపక్. ఈ క్రీడాకారుడితో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పురుషుల విభాగంలో 63, మహిళల విభాగంలో 45 మంది బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటి వరకు రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో 9 మంది టోక్యో ఒలిపింక్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఆసియా నుంచి ఇప్పటివరకు చైనా (25), కొరియా (12), జపాన్ (12) షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.