Asian Para Games India 100 Medals: హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో ఎన్నడూ లేని విధంగా భారత్ పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. ఇప్పటికే 2018 రికార్డులను(72) బ్రేక్ చేయగా.. తాజాగా శనివారం నాటికి 100 పతకాల మైలురాయిని అందుకుంది. శుక్రవారం ఇండియా ఖాతాలో 99 పతకాలు ఉన్నాయి. అయితే శతకానికి అడుగు దూరంలో ఉన్న భారత్‌కు శనివారం ఉదయం పురుషుల విభాగం 400 మీ టీ47 ఈవెంట్లో దిలీప్ స్వర్ణం కైవసం చేసుకోవటం వల్ల.. 100పతకాలు సాధించిన ఘనతను దక్కించుకుంది.
చివరి రోజైన ఈ క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రస్తుతం 111కు చేరుకుంది. ఇందులో 29 బంగారు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో ఇండియా ఐదో స్థానంలో నిలిచింది. 2018 ఇండోనేషియాలో జరిగిన మూడో ఆసియా పారా క్రీడల్లో 15 బంగారు పతకాలు, 24 రజతాలు, 33 క్యాంసాలతో ఇండియా 72 పతకాలను కైవసం చేసుకుంది. అయితే ఈ సంవత్సరం భారత్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయటంతో పాటుఆసియా క్రీడల్లో లాగా 100 పతకాల మైలురాయిని అందుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అథ్లెట్లకు అభినందనలు తెలుపుతున్నారు.