Asian Para Games 2023 : పారా ఆసియా క్రీడల్లో మన భారత ప్లేయర్లు పతకల వేటను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ ఓ సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. ఇప్పటిదాకా 82 పతకాలు (18 స్వర్ణ, 23 రజత, 41 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్.. 2018 జకార్తా క్రీడల్లో నమోదైన 72 పతకాల రికార్డును బద్దలుకొట్టింది. గురువారం ఒక్కరోజే 19 పతకాలు (3 స్వర్ణ, 3 రజత, 13 కాంస్యాలు) ఇండియా ఖాతాలోకి చేరాయి. అయితే ఆటలు ముగియడానికి మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వంద పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోంది. ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.
మూడు స్వర్ణాలు సొంతం: సిద్ధార్థ్ బాబు (మిక్స్‌డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), సచిన్ ఖిలారి (షాట్‌పుట్), షీతల్ దేవి-రాకేశ్ కుమార్ (ఆర్చరీ మిక్స్‌డ్ కాంపౌండ్) పసిడి పతకాలను ముద్దాడారు. షాట్‌పుట్‌లో 16.03 మీటర్లు గుండును విసిరిన సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ రోహిత్‌కుమార్ (14.56 మీ) కూడా కాంస్యం నెగ్గాడు. 50 మీటర్ల ప్రోన్ షూటింగ్ విభాగంలో సిద్ధార్థ్ (247.7 పాయింట్లు) టాప్ ప్లేస్‌లో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్చరీ మిక్స్‌డ్ కాంపౌండ్ తుది పోరులో షీతల్-రాకేశ్ ద్వయం 151-149తో లిన్-గ్జిన్‌లియాంగ్ (చైనా)పై గెలుపొందింది. మోను (డిస్కస్‌త్రో), సిమ్రన్ (100 మీటర్లు), భాగ్యశ్రీ జాదవ్ (షాట్‌పుట్) రజతాలు సొంతం చేసుకున్నారు.