Asian Games Medals List :ఆసియా క్రీడల్లో పతాకల వేట కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఆర్చరీ మహిళా టీమ్ కాంపౌండ్ విభాగం భారత్‌కు మరో పసిడి దక్కింది. ఆర్చర్లు అదితి, జ్యోతి సురేఖ వెన్నమ్ పర్నీత్ కౌర్ రాణించి.. 230-228 స్కోర్‌లైన్‌తో చైనీస్ తైపీ జట్టును ఓడించారు. దీంతో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ఖాతాలో మరో స్వర్ణం వచ్చింది. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్‌లో కాంస్యం నెగ్గిన సురేఖ.. 2018లో రజతం గెలిచింది. ఇప్పుడు పసిడి సొంతం చేసుకుంది.
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లో ప్రముఖ స్క్వాష్ ద్వయం దీపికా పల్లికల్ల్, హరిందర్ పాల్ సింగ్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. తాజాగా జరిగిన ఫైనల్స్ ఈవెంట్లో మలేసియా జట్టుపై 2-0 పాయింట్ల తేడాతో పసిడిని ముద్దాడారు.
మరోవైపు అందరి అంచనాలను నిజం చేస్తూ జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్ కుమార్ జెనా కెరీర్ బెస్ట్ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు.
మహిళల 1500 మీటర్లలో రజతం గెలుచుకున్న హర్మిలన్ 800 మీటర్లలోనూ మరో రజతం సాధించింది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.