Asian Games India Medals 2023 :2023 ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత్ విజయం సాధించింది. భారత స్టార్ షట్లర్లు.. సాత్విక్-చిరాగ్ శెట్టి ద్వయం.. సౌత్ కొరియా చి సోల్గ్యు-కిమ్ వొన్హో పై 21-18, 21-16 తేడాతో గెలుపొందారు. దీంతో ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్స్‌లో గెలిచిన తొలి భారత ద్వయంగా సాత్విక్ - చిరాగ్ శెట్టి రికార్డుకెక్కారు.
కబడ్డీలోనూ స్వర్ణం..ఆసియా గేమ్స్‌లో చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ ఫైనల్లో భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇరు జట్లు 28-28తో సమానంగా ఉన్న వేళ భారత రైడర్ నవీన్ చేసిన రైడ్‌తో వివాదం చెలరేగింది. అంపైర్లు చాలాసేపు చర్చల తర్వాత తొలుత భారత్‌కు మూడు పాయింట్లు కేటాయించారు. కానీ దీనిపై ఇరాన్ ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారు. మరోసారి తమ నిర్ణయం మార్చుకున్న అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీనిపై భారత ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చాలాసేపటి వరకు ఈ వివాదం కొనసాగింది. ఎంతకీ ఆటగాళ్లు నిరసన విరమించకపోవడంతో చాలా సేపు తర్జనభర్జన తర్వాత మ్యాచ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రిఫరీలు ప్రకటించారు. తర్వాత అన్ని వీడియోలను పరిశీలించి భారత్‌కు మూడు పాయింట్లు కేటాయించారు. చివరకు 33-29 తేడాతో ఇరాన్‌పై గెలిచిన భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
రెజ్లింగ్‌లో రజతం.. హాకీలో కాంస్యం.. రెజ్లింగ్‌లో పురుషుల 86 కేజీల ప్రీస్టైల్ విభాగంలో దీపక్ పునియా సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. హసన్ యజ్దానీ (ఇరాన్)తో జరిగిన ఫైనల్‌లో దీపక్ 0-10 తేడాతో ఓడిపోయి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. మరోవైపు, హాకీలో భారత మహిళల జట్టు బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది.