Asian Games 2023 India :ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఈశా సింగ్‌లతో కూడిన టీమ్.. ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలుచుకుంది. 1759 పాయింట్లతో ఈ త్రయం తొలి స్థానాన్ని కైవసం చేసుకుని పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ గేమ్‌లో ఆతిథ్య చైనా జట్టు 1756తో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, సౌత్ కొరియా షూటర్లు1742 స్కోరు సాధించి మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నారు.
సిఫ్ట్ సమ్రా కౌర్ ప్రపంచ రికార్డు..
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ సమ్రా కౌర్ (469.6 పాయింట్లు) ప్రపంచ రికార్డును నమోదు చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది. చైనాకు చెందిన షూటర్ జంగ్ (462.3 పాయింట్లు) రజతం, భారత షూటర్ అషి చౌష్కీ (451.9 పాయింట్లు) కాంస్య పతకాలు సాధించారు.
పురుషుల 50 మీటర్ల స్కీట్ షూటింగ్ విభాగంలోనూ భారత్ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. అంగద్ వీర్ సింగ్ బజ్వా, గుర్జోత్ ఖంగురా, అనంత్ జీత్ సింగ్ నరుకలతో కూడిన భారత జట్టు మూడో స్థానాన్ని సరిపెట్టుకుంది. పురుషుల డింగీ ILCA7 ఈవెంట్‌లో భారత ఆటగాడు విష్ణు శర్వణన్ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకాన్ని గెలుచుకుంది. పురుషుల స్కీట్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన అనంత్‌జీత్ సింగ్ నరుకా రజతం సాధించాడు.