Asian Games 2023 India Medals :చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌ను భారత్ ఘనంగా ముగించింది. గతంతో ఎన్నడూ లేనని పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. మొత్తం 107 పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో కొత్త చరిత్ర లిఖించింది. రేపటితో(అక్టోబర్ 8) ఆసియా గేమ్స్ ముగియనుండగా ఇప్పటికే భారత్ పోటీపడే విభాగాలన్నీ పూర్తయ్యాయి. చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 198 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్య పతకాలతో.. డ్రాగన్ తొలి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో, కొరియా మూడో స్థానంలో నిలిచాయి.
భారత్ శనివారం(సెప్టెంబర్ 7) ఒక్కరోజే ఆరు స్వర్ణ పతకాలు సహా 12 పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ ముచ్చటగా మూడో పసిడి పతకం సాధించింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దక్షిణకొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ విజయం సాధించి స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగా. అభిషేక్ రజతం సాధించాడు. చివరి నిమిషంలో.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్లో భారత్ 33-29 తేడాతో ఇరాన్‌పై గెలిచి.. స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. దక్షిణ కొరియా జంట చోయ్ సోల్ జియు-కిమ్ వన్ హోల్‌పై 21-18, 21-16 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పతకంతో ఆసియా క్రీడల బాడ్మింటన్‌లో స్వర్ణాన్ని నెగ్గిన తొలి భారత్ డబుల్స్ జోడీగా రికార్డు సాధించారు.