Asian Games 2023 India Medals : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంతగా పతకాలను సాధిస్తూ దూసుకుపోతోంది. 18 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్యాలతో భారత్ ఇప్పటివరకూ 81 పతకాలను సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అందరి అంచనాలను నిజం చేస్తూ జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్ కుమార్ జెనా కెరీర్ బెస్ట్ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ - ఓజాస్ డియోటలే జోడీ బంగారు పతకం సాధించింది. ఫైనల్లో దక్షిణ కొరియా జట్టును 159-158 తేడాతో భారత్ ఓడించింది. ఆసియా క్రీడల్లో ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో స్వర్ణపతకం.
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 4x400 మీటర్ల రీలేలో భారత పురుష అథ్లెట్లు స్వర్ణంతో సత్తా చాటగా ఇదే విభాగంలో మహిళా అథ్లెట్లు రజత పతకం సాధించారు. పురుషుల 5 వేల మీటర్ల ఫైనల్‌లో అవినాశ్ ముకుంద్ సాబలే రజతం పతకం అందుకున్నాడు. 18 నిమిషాల 21.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని సాబలే రెండో స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల్లో సాబలేకి ఇది రెండో పతకం. 3 వేల మీటర్ల పరుగులో అతడు ఇప్పటికే పసిడి గెల్చుకున్నాడు.
మహిళల 1500 మీటర్లలో రజతం గెలుచుకున్న హర్మిలన్ 800 మీటర్లలోనూ మరో రజతం సాధించింది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి. హాకీలో భారత పురుషుల జట్టు సెమీస్‌లో కొరియాను 5-3 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖరారు చేసింది. బ్రిడ్జిలో చైనాను మట్టికరిపించి ఫైనల్ చేరిన భారత్ కనీసం రజతాన్ని ఖాయం చేసింది. బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది. లవ్లీనా ఓటమితో ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పోరాటం స్వర్ణ పతకం లేకుండానే ముగిసింది. ఒక రజతం, నాలుగు కాంస్యాలతో భారత బాక్సర్లు మొత్తం 5 పతకాలు సాధించారు.