Asian Games 2023 India Gold Medal: భారత స్టార్, తెలుగమ్మాయి జ్యోతి సురేఖ భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించి సత్తా చాటింది. ముచ్చటగా మూడో స్వర్ణం సాధించి భారత కీర్తి పతాకను చైనా గగనతలంపై రెపరెపలాడించింది. ఇప్పటికే ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన జ్యోతి సురేఖ.. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలోనూ పసిడి పతకం అందుకుంది.
తెలుగమ్మాయి భళా..
తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 149-145తో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ అద్భుత ఆటతీరుతో గెలుపొందింది. ప్రారంభంలో కాస్త తడబడ్డ ఈ భారత స్టార్ ఆర్చర్.. తర్వాత తన అనుభవాన్నంత ఉపయోగించి అద్భుతంగా పుంజుకుంది.
మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రారంభంలో 8 పాయింటర్ ప్రారంభించిన సురేఖ.. తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి రెండు రౌంట్లలో జ్యోతి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తర్వాత 149-145తో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అదితితి కాంస్యం..
అంతకుముందు ఆర్చరీలో భారత్‌కు మరో కాంస్య పతకం కూడా దక్కింది. అదితి గోపీచంద్ స్వామి 146-140తో ఇండోనేసియాకు చెందిన రాతిహ్ జిలిజాటిని ఓడించి కాంస్య పతకాన్ని సాధించి ఆసియా గేమ్స్ చివరి రోజు భారత్‌కు ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చింది. అదితి 17 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా అదితి బంగారు పతకం సాధించింది.
కబడ్డీలో పసిడి..
ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్‌లో ఓజస్ డియోటల్.. స్వర్ణ పతకం సాధించాడు. అదే ఫైనల్లో మరో భారత్ ప్లేయర్ అభిషేక్ వర్మ రజత పతకం గెలుచుకున్నాడు. మరోవైపు భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్స్‌లో చైనీస్ తైపీపై పైచేయి సాధించింది. మొదటి 20 నిమిషాల్లో ఇరు జట్లు 14-9 పాయింట్లు సాధించాయి. భారత రైడర్ పూజా హత్వాలా ఒకే రైడ్‌లో నాలుగు పాయింట్లు సాధించాడు. సెకండాఫ్‌లో చైనా ప్లేయర్లు రాణించడం తో 39వ నిమిషానికి ఇరు జట్లు డ్రాగా నిలిచాయి. చివరి నిమిషంలో 26-25తో భారత్ మహిళలు పసిడి పట్టేశారు.