Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్‌షిప్ 2023 హాకీ సెమీఫైనల్స్‌లో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నాటి రెండో సెమీల్లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కాగా ఈ విజయంలో హర్మన్ సేన ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఇక తుదిపోరులో భారత్ మలేసియాను ఢీ కొట్టనుంది.
చెన్నైలోని రాధాకృష్ణ స్టేడియంలో జరిగిన సెమీస్‌లో భారత్ మొదటి నుంచి ధీటుగానే ప్రత్యర్థిని ఎదుర్కొంది. కాగా పెనాల్టీ రూపంలో భారత్‌కు తొలి స్కోరింగ్ పాయింట్ వచ్చింది. 19వ నిమిషం వద్ద ఆకాశ్‌దీప్ గోల్ ద్వారా భారత్ ముందంజ వేసింది. తర్వాత జోరును కొనసాగిస్తూ.. 23వ నిమిషం వద్ద రెండో పెనాల్టీ కార్నర్లో భారత కెప్టెన్ హర్మన్.. జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. సగం ఆట ముగిసేసరికి భారత్ మూడు రెట్ల ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా భారత ఆటగాళ్లు అదే జోరు కొనసాగించారు. చివర్లో భారత యంగ్ ప్లేయర్ కార్తి సెల్వం.. 51వ నిమిషం వద్ద గోల్ సాధించడం వల్ల భారత్ ఆటను 5 - 0తో ముగించి జయకేతనం ఎగురవేసింది.
Asian Champion Trophy Final : శనివారం ఫైనల్స్‌లో భారత్.. మలేసియాతో తలపడనుంది. మరోవైపు సెమీస్‌లో ఓడిన జపాన్, డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా మధ్య మూడు, నాలుగు స్థానాల కోసం మ్యాచ్ జరగనుంది. కాగా భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, జపాన్, పాకిస్థాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరు దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఐదింట్లో నాలుగు గెలిచి లీగ్ స్థాయిలో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది భారత్.