Asia hockey cup 2022: ఆసియాకప్ మహిళల హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్ సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జట్టు.. కాంస్యంతో సంతృప్తి చెందింది. మరోవైపు టైటిల్‌ను జపాన్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 4-2తో కొరియాను ఓడించింది. శుక్రవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 2-0 గోల్స్‌తో చైనాను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. వరుస అవకాశాలను సృష్టించుకుంది. 13వ నిమిషంలో షర్మిలాదేవి చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన మన జట్టు.. ఆ తర్వాత గుర్జీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్ గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. వెంటనే చైనా కూడా ఓ పెనాల్టీ కార్నర్‌ను దక్కించుకున్నా గోల్‌కీపర్ సవిత ప్రత్యర్థి గోల్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఒకవైపు దాడుల నుంచి కాపాడుకుంటూనే.. చైనాపై ఒత్తిడిని పెంచిన భారత్.. ఆఖరిదాకా అదే జోరు ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో మలేసియాను ఓడించి.. ఆ తర్వాత జపాన్ చేతిలో ఓడిన భారత్.. సింగపూర్‌పై నెగ్గి సెమీస్ చేరింది. సెమీస్‌లో భారత్.. కొరియా చేతిలో ఓడింది.